నంద్యాలలో 70వ APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NANDYAL Aug17 :- ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్లుజె) 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎపియుడబ్లుజె నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక త్రినేత్ర లాడ్జి ఆవరణలో ఎపియుడబ్ల్యుజె జెండాను యూనియన్ నాయకులు ఆవిష్కరించారు.కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఖండే శ్యాం సుందర్ లాల్, గౌరవ సలహాదారులు, సీనియర్ పాత్రికేయులు ఎం. జనార్దన్ రెడ్డి, కనకరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ భాష, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రాజ్ కుమార్ రెడ్డి, వైఫై బాషా, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్కింగు జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలనీ, రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలులో ఉన్న నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల పలువురు జర్నలిస్టులు ఆరోగ్య ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, బకాయిలున్నాయన్న పేరుతో నెట్ వర్క్ ఆస్పత్రులలో హెల్త్ కార్డును అనుమతించుట లేదని, కావున జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని కోరారు. పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సమాచార శాఖ, ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ, తద్వారా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని కూటమి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం మినహా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018-19లో ఎన్నికల ముందు ప్రకటించిన హౌసింగ్ పథకం ఆచరణలో అమలుకు నోచుకోలేదని, అందువల్ల ఇళ్ల స్థలాల విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వృత్తి ద్వారా సమాజానికి చేసిన సేవలను, వారికి తగిన వేతనాలు గానీ, ఉద్యోగ విరమణ పింఛను గానీ లేని పరిస్థితులను, వారి వయసును దృష్టిలో ఉంచుకుని విశ్రాంత జీవితాన్ని గౌరవప్రదంగా గడపడానికి వీలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని, జర్నలిస్టులపై పెరిగిపోతున్న భౌతిక దాడులు, బెదిరింపులు, దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai