NANDYAL June12 :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహానంది దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాభ్యాసం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. నిత్యం 30 నుంచి 45 నిమిషాల పాటు యోగాభ్యాసం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సమతుల్యత సాధించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన వంటి విలువలను కూడా పెంపొందిస్తుందని వివరించారు

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2026 కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతో జూన్ 7న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జూన్ 21 వరకు గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిల్లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యోగాపై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ ద్వారా నమోదు చేసుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం కావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం, మహానంది దేవస్థానాల్లో యోగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

జూన్ 17న జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్ ఆధారంగా యోగాంధ్ర అసోసియేషన్ సభ్యులందరితో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జూన్ 21న జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సుమారు ఒక లక్ష మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా యోగా ప్రదర్శన ఇచ్చిన మహిళా బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. యోగా శిక్షణ అందించిన రమ్యతో పాటు ప్రదర్శనలో పాల్గొన్న ఐదుగురు సభ్యులు మహిళలే కావడం విశేషమని పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచిన వందితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఉదయం నుంచే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మహానంది దేవస్థానం ఈఓ, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మరియు వైద్య బృందాలకు, అలాగే కార్యక్రమ విజయవంతానికి నాయకత్వం వహించిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌కు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మహానంది క్షేత్రంలో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమం పాల్గొన్న వారిలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు యోగాపై మరింత ఆసక్తిని కలిగించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
Arattai