మత్తు పదార్థాల నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL July29 :- జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై కలెక్టర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల నియంత్రణపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను విశ్లేషించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని పోలీసు, ఎక్సైజ్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు అందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే మాదకద్రవ్యాల నియంత్రణలో ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు. యువతలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, ఈగల్ బృందాలు, పోలీసు సిబ్బంది ద్వారా నిరంతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నందికొట్కూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి శికారిపేటకు చెందిన పలువురు విద్యార్థినులు గైర్హాజరు కావడాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వారి గైర్హాజరుకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రతి ఇంటిని సందర్శించి విద్యార్థుల విద్యా పరిస్థితులపై నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులను, అక్రమ మద్యం తదితర నిషేధిత కార్యకలాపాలపై వివరాలు సేకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో 260 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 374 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్ టెస్టింగ్ కిట్లు, ప్రత్యేక తనిఖీలు, కంబింగ్ ఆపరేషన్లు, పాఠశాలల పరిసరాల్లో నిఘా, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామని, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైళ్లలో స్నిఫర్ డాగ్స్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాల సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

ఎక్సైజ్ అధికారులు నాటుసారా, అక్రమ మద్యం రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు డీ-అడిక్షన్, పునరావాస చర్యలను కూడా చేపడుతున్నట్లు విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, ఎస్డీపీఓలు, ఎక్సైజ్, విద్య, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Arattai