డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రోగులకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL July29 :- డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అర్హులైన రోగులకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా అన్ని వైద్య సేవలను పూర్తిస్థాయిలో ఉచితంగా అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి జిల్లా డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ (డీడీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డియంహెచ్ఓ డా. వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డా. ఓ. లలిత, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పథకం కింద చికిత్స పొందే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని ఆసుపత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో చేరిన ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలను నిబంధనల ప్రకారం పూర్తిగా ఉచితంగా అందించాలని ఆదేశించారు. రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా చికిత్స అందించడం ప్రతి ఎంప్యానెల్డ్ ఆసుపత్రి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. పథకం నిబంధనలు ఉల్లంఘించి పేదల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే సంబంధిత ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద కన్సల్టేషన్, అవసరమైన వైద్య పరీక్షలు, అత్యవసర వైద్య సేవలు తదితర అన్ని సేవలను రోగులకు పూర్తిగా ఉచితంగా అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు.
Arattai