రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వేయండి: RARS
NANDYAL Aug 04 :- ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారి ఆధ్వర్యంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై అవగాహన సదస్సులు ఆత్మకూరు మండలంలోని నలకాల్వ, కరివెన గ్రామాల్లో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏ.డి.ఆర్. డాక్టర్. జయలక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు ప్రతిబింబించే విధంగా ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉందని, ఈ పరిస్థితులలో రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా మినుము, కొర్ర, సజ్జ, జొన్న వంటి తక్కువ నీటి అవసరం ఉన్న తక్కువ కాలం పంటలను సాగు చేయాలని సూచించారు.

ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్. మంజునాథ్ మాట్లాడుతూ నేల తేమను కాపాడుకోవడానికి మల్చింగ్ పద్ధతులు పాటించాలని, అలాగే సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రొఫెసర్ డాక్టర్. విజయభాస్కర్ బెట్టు పరిస్థితుల్లో పంటకు ఫోలియర్ పోషకాల పిచికారీ ప్రాముఖ్యతను, చీడపీడల నుండి పంటను ఎలా కాపాడుకోవాలో వివరించారు.సైంటిస్ట్ డాక్టర్. ఫరీదా నీటి ఆదా కోసం సాలు మార్చి నీళ్లు పెట్టడం, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతులను వినియోగించాలని సూచించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. జయచంద్ర రెడ్డి ఎల్ నినో ప్రభావం వల్ల నేల సారాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు.మండల వ్యవసాయ అధికారి శ్రీమతి. హేమలత రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని దాని ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఆర్. డాక్టర్. జయలక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్. మంజునాథ్, ప్రొఫెసర్ డాక్టర్. విజయభాస్కర్, సైంటిస్ట్ డాక్టర్. ఫరీదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. జయచంద్ర రెడ్డి, ఏ.డి.ఏ. శ్రీమతి. హేమలత గారు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Arattai