గౌరవ డాక్టరేట్ అందుకున్న రవీంద్రనాథ్ కు ఘన సన్మానం..
NANDYAL Aug09:- పత్తి పరిశోధనా రంగంలో 36 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి, దేశవ్యాప్తంగా రైతాంగ అభ్యున్నతికి తన పరిశోధనలను అంకితం చేసిన నంద్యాల పట్టణానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్ కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించడం నంద్యాల ప్రాంతానికే కాకుండా రాయలసీమ రైతాంగానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు కొనియాడారు. 90 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆదివారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో డాక్టర్ రవీంద్రనాథ్‌కు ఘన అభినందన సభ నిర్వహించారు.
నంది రైతు సమాఖ్య అధ్యక్షులు బీవీ రామసుబ్బారెడ్డి, కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సభకు నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు. మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు సమన్వయకర్తగా వ్యవహరించారు.పత్తి పరిశోధనలో డాక్టర్ రవీంద్రనాథ్ చేసిన సేవలు అసాధారణమైనవని సభలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పత్తి ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో 1959 నుంచి 1996 వరకు వివిధ హోదాల్లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన, తన 36 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనా ప్రస్థానంలో 60కి పైగా పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికల్లో ప్రచురించారు.ఆయన అభివృద్ధి చేసిన ‘నరసింహ’ పత్తి వంగడం భారతదేశంలో హైబ్రిడ్ పత్తి విత్తనాల అభివృద్ధికి మాతృకగా నిలిచిందని వక్తలు గుర్తుచేశారు. నరసింహ విత్తన ఆధారంగా అభివృద్ధి చెందిన హైబ్రిడ్ పత్తి వంగడాలు దేశంలో కోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్నాయని పేర్కొన్నారు. పత్తి విత్తనాల వాణిజ్యం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం సమకూరే స్థాయికి ఆయన పరిశోధనల ప్రభావం విస్తరించడం ఆయన శాస్త్రీయ ప్రతిభకు నిదర్శనమని తెలిపారు.

నరసింహ, అరవింద తదితర పత్తి వంగడాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన శాస్త్రీయ సాగు పద్ధతులపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల ద్వారా పత్తి సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు విలువైన సూచనలు అందించారని గుర్తుచేశారు.
పత్తి పరిశోధనపై తనకున్న అపార అనుభవాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా పంచుకున్న డాక్టర్ రవీంద్రనాథ్ అనేక దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో ఉపన్యాసాలు ఇచ్చారని సభలో వివరించారు. యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని వ్యవసాయ కేంద్రాలను సందర్శించి అధిక దిగుబడుల సాధనకు అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను వివరించారని తెలిపారు.రైతాంగానికి, వ్యవసాయ పరిశోధనకు ఆయన చేసిన అపార సేవలకు 2015లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారని, అదే ఏడాది రైతు నేస్తం ఫౌండేషన్ వారి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాన్ని కూడా అందుకున్నారని పేర్కొన్నారు. ఆయన ప్రతిభకు, సేవలకు దాదాపు 14 ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయని తెలిపారు.
సభలో పాల్గొన్న పోచా బ్రహ్మానందరెడ్డి, బీవీ రామసుబ్బారెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు, వెంకటరామిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, ప్రముఖ న్యాయవాది రామచంద్రారెడ్డి, డాక్టర్ గెలివి సహదేవుడు, శ్రీనిధి రఘువీర్, శ్రీనివాసమూర్తి, శివరామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ ఎన్సీ లక్ష్మయ్య, డాక్టర్ కురుమేటి కిషోర్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ రవీంద్రనాథ్ పరిశోధనలు రైతు జీవితాలతో ముడిపడినవని, ప్రయోగశాలలో ప్రారంభమైన ఆయన పరిశోధనలు లక్షలాది రైతుల పొలాలకు చేరి ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చాయని ప్రశంసించారు.
రాయలసీమ వంటి కరవు ప్రాంతంలో రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని అందించడం ద్వారా రవీంద్రనాథ్ తనదైన ముద్ర వేశారని, ఆయన ప్రతిభావంతమైన పరిశోధకుడిగా మాత్రమే కాకుండా రైతు నేస్తంగా కూడా గుర్తింపు పొందారని కొనియాడారు. ఇలాంటి మహోన్నత శాస్త్రవేత్త నంద్యాల ప్రాంతానికి చెందినవారు కావడం తెలుగుజాతికి గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ గంగుల నాగరాజు, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ తదితర కవులు డాక్టర్ రవీంద్రనాథ్ పరిశోధనా ప్రస్థానాన్ని, రైతాంగానికి ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ కవితలు వినిపించారు. మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి డాక్టర్ రవీంద్రనాథ్ జీవిత విశేషాలను సభకు వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయక దేశమని, వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసి దేశాన్ని సమున్నతంగా నిలపాలన్నదే తన జీవిత ఆశయమని తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందించడం తనకు ఎంతో ఆనందం, సంతృప్తిని కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయడం, వ్యవసాయ రంగానికి తన వంతు సేవ అందించడం తన జీవితానికి లభించిన గొప్ప సార్థకత అని పేర్కొన్నారు.
అనంతరం పోచా బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో భారతి బీఈడీ కళాశాల, శ్రీశైల పబ్లిక్ స్కూల్ సిబ్బంది డాక్టర్ రవీంద్రనాథ్ను ఘనంగా సత్కరించారు. వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో రైతు నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఓబులపతి, చంద్రశేఖర్ రెడ్డి నంది రైతు సమాఖ్య సభ్యులు, సాహితీ సంస్థల ప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పత్తి పరిశోధనలో ఒక శకాన్ని సృష్టించి, తన విజ్ఞానాన్ని రైతు సంక్షేమానికి అంకితం చేసిన డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్‌కు లభించిన గౌరవ డాక్టరేట్ ఒక్క వ్యక్తికి దక్కిన గౌరవం మాత్రమే కాదని, నంద్యాల నేలకు, రాయలసీమ రైతాంగానికి, భారతీయ వ్యవసాయ పరిశోధనకు దక్కిన గౌరవమని సభ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.
Arattai