వైభవంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం
NANDYAL Sep05 :- స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా సేవలందించిన నివర్తి వెంకటసుబ్బయ్య స్థాపించిన పాఠశాల శ్రీ రామకృష్ణ విద్యాలయం 70 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం నంద్యాల పట్టణంలో వైభవంగా నిర్వహించారు.పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం దగ్గర నుండి పూలతో అలంకరించిన గురు వందన రథం పై ఉపాధ్యాయులను కూర్చోబెట్టి రధానికి తాళ్లు కట్టి భారీగా హాజరైన పూర్వ విద్యార్థులు లాగుతూ ఊరేగింపుగా, మేళ తాళాలతో సంజీవ్ నగర్ లో ఉన్న పాఠశాల వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా గురువందన రధం పై పూల వర్షం కురిపించారు. ఉపాధ్యాయులకు పాఠశాల వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.

పాఠశాలలో తాము చదువుకున్న సమయంలో నిర్వహించిన విధానంలో ప్రార్థన నిర్వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ సామూహికంగా ఆలాపించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్,పాఠశాల వ్యవస్థాపకులు నివర్తి వెంకటసుబ్బయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.1974 లో ప్రారంభమైన పదవ తరగతి బ్యాచ్ తో కలిసి దాదాపు 50 బ్యాచ్ లకు చెందిన 600 మంది పైగా హాజరైన విద్యార్థులు తాము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదం చేసిన గురువులను, తమ సహాధ్యాయులను సుదీర్ఘకాలం తర్వాత కలవడం తో ఆ ప్రాంగణమంతా ఉద్వేగ భరిత వాతావరణం కనిపించింది. తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాఠశాల గదుల్లో ఉల్లాసంగా తిరిగారు. గురువులకు పాదాభివందనం చేసి విద్యార్థులు ఆశీస్సులు అందుకున్నారు. తాము విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం చూసి ఉపాధ్యాయులు ఆనందభరితులయ్యారు.
తదుపరి ప్రధమ(ప్రమద నంది) కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థులైన డాక్టర్ రవికృష్ణ, ఫ్యాక్టరీస్ అధికారి శివకుమార్ రెడ్డి, రవి ప్రకాష్, శ్రీధర్, ప్రమద నంది దేవస్థానం చైర్మన్ చలం బాబు, విజయ భాస్కర్, జర్నలిస్ట్ మధు, వరదా మురళి, మహబూబ్ బాషా తదితర నిర్వాహక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఒక్కో గురువును ఒక బ్యాచ్ విద్యార్థుల బృందం శాలువా, పూలమాల, తలపాగా, నూతన వస్త్రాలు, జ్ఞాపిక, కొబ్బరికాయతో తాంబూలం,ట్రావెల్ బ్యాగ్ బహుమతులను అందించి అంగరంగ వైభవంగా సత్కరించారు. సన్మాన స్వీకరించిన గురువులతో ప్రతి బ్యాచ్ గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నివర్తి మోహన్ మాట్లాడుతూ తమ తండ్రి నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాలలో సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్ ఏర్పాటుకు నాంది పలికారని, సంజీవనగర్ ఏర్పడిన తర్వాత అక్కడ పిల్లలకు పాఠశాల అవసరం ఉండడంతో 1956లో ఈ పాఠశాలను స్థాపించారని తెలిపారు. తదుపరి వివిధ సందర్భాలలో నిర్మించిన భవనాలను అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, అప్పటి ప్రధానమంత్రి నరసింహారావు వంటి ప్రముఖులు ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా 1974లో 10వ తరగతి బ్యాచ్ మొదలుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పట్టణంలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలగా నిలిచిందని అన్నారు. ఒక సమయంలో దాదాపు 200 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండే వారిని తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు లేకపోవడం, అనేక ప్రైవేట్ పాఠశాలలు రావడంతో ప్రస్తుతం తక్కువ సంఖ్యతో పాఠశాల నడుపుతున్నామని, భవనాలకు కూడా మరమ్మతుల అవసరం ఉందని అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ, శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల, ఉపాధ్యాయులు విద్యార్థులు అందరినీ ఉన్నత విలువలతో తీర్చిదిద్దారని, వివిధ రంగాలలో ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్న వారు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో నలుమూలలా ఉన్నారని తెలిపారు. వీరందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు అందరి తరపున ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీరాములు, ఆంజనేయులు, శ్రీరంగం, సుబ్బరాయుడు, మల్లికార్జున, నరసింహారావు,రామ సుబ్బారెడ్డి,చంద్రశేఖర్, రామ్మూర్తి, శేషఫణి శర్మ, గంగాధర శాస్త్రి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు, ఉపాధ్యాయులు సునీతమ్మ, పుల్లయ్య గంగాధర రెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సత్కారం స్వీకరించారు.
Arattai