నంద్యాల, అక్టోబర్ 10:-భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి విచ్చేయనున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా, ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి సున్నిపెంటలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను అత్యవసరంగా పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్ నుండి ప్రధానమంత్రి పర్యటించే ప్రదేశాల దాకా రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ వంటి అన్ని అంశాల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు.

పర్యటన సమయంలో గ్రీన్ రూమ్‌లో ప్రధానమంత్రి కార్యాలయంలో లభించే సదుపాయాలు సమానంగా ఉండేలా పంచాయతీరాజ్ ఇంజినీర్లు ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు నిపుణులైన వైద్యుల బృందాలను నియమించి, అంబులెన్స్‌లు, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ అధికారులను ఆమె ఆదేశించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్ మరియు దేవస్థాన పరిధిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అలాగే పర్యటన ప్రాంతం అంతటా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టి, శుభ్రతతో సుందరంగా తీర్చిదిద్దాలని శానిటేషన్ అధికారులను సూచించారు. పార్కింగ్ స్థలాలు, బారికేడింగ్, తాగునీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల సమన్వయం వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని పూర్తి చేయాలన్నారు. ప్రతి శాఖ నోడల్ అధికారిని నియమించి, రోజువారీ పురోగతి నివేదిక సమర్పించాలన్నారు.
పర్యటన సమయంలో ఏ చిన్న లోపం చోటు చేసుకోకుండా, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు. ఇది జిల్లాకు గౌరవకరమైన, ప్రతిష్ఠాత్మకమైన పర్యటన అని… శ్రీశైల దేవస్థాన పవిత్రతకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి” అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాధ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply