పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన అల్పాహారం,భోజనం కస్టమర్లకు అందించేలా హోటల్స్ యాజమాన్యం కృషి చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనిధి రఘువీర్ పిలుపునిచ్చారు. నంద్యాల హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మూలమఠంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మరియు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రఘువీర్ మాట్లాడుతూ హోటల్స్ నిర్వహణ కేవలం వ్యాపార ధోరణి కాదని అతిథిని దేవుడిగా భావించే భారతీయ సంస్కృతికి ప్రతిబింబమన్నారు. సభ్యులకు చక్కటి మార్గ నిర్దేశం చేస్తూ ఐక్యత నెలకొల్పడానికి అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ముఖ్య అతిథి కేసి కల్కూర మాట్లాడుతూ సభ్యుల మధ్య ఐక్యత స్నేహభావాన్ని వనభోజనం లాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయన్నారు.

ప్రధాన వక్త జిల్లా ఆహార భద్రతాధికారి వెంకటరాముడు మాట్లాడుతూ ఆహార పదార్థాలలో టేస్టింగ్ సాల్టు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించరాదని హోటల్స్ లో శుచి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉసిరి చెట్టు పూజ నిర్వహించారు. అనంతరం క్యూబికా స్కిల్స్ అకాడమీ వారు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించి అసోసియేషన్ సభ్యులు దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో నంద్యాల హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు లింగారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి విజయ్ మురళీధర్, కల్కూర వాసు, రవిచంద్రారెడ్డి, సుధాకర్ అసోసియేషన్ నాయకులు మనోహరరెడ్డి, కిరణ్ , దీపక్ , పల్లా నాగరాజు, శివయ్య, గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, అన్నెం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల భవన్ విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు రజనీ కల్కూర ఆలపించిన గేయాలు అందర్నీ అలరించాయి. కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించారు.
Arattai