NANDYAL April 30 :- ఆధునిక సాహిత్యాన్ని శ్రమైక జీవన సౌందర్యం వైపు మళ్ళించిన మహాకవి శ్రీశ్రీ అని సాహితీ స్రవంతి అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి అన్నారు. జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నంద్యాల పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో గురువారం శ్రీశ్రీ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. సాహితీ స్రవంతి నాయకులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సాహిత్యం సమాజహితమై ఉండాలని శ్రీశ్రీ కోరుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షులు కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం నేటి తరానికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ సంఘం తరపున త్వరలో సివిల్స్ కు ఉచిత శిక్షణను ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. గౌరవ అతిథి చిత్తూరు జిల్లా జడ్పీ సీఈవో వెంకట నారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల అంకుశమై శ్రీశ్రీ సాహిత్యం నిలిచిందన్నారు.

సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని విప్లవపథం వైపు నడిపిన విరాణ్మూర్తి శ్రీశ్రీ అని పేర్కొన్నారు. రోటరీ విద్యాసంస్థల అధినేత డి.వి సుబ్బయ్య, సామాజికవేత్త సుబ్బారెడ్డి మాట్లాడుతూ సాహితీవేత్తల జయంతులను ఘనంగా నిర్వహిస్తున్న నంద్యాల సాహితీ సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు. శ్రీ శ్రీ సాహిత్యం నేటి యువతకు ఆదర్శమని మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన నీలం అస్మితను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రామిక కవనంలో కవులు నీలకంఠమాచారి, నరేంద్ర, రఫీ, మహబూబ్ బాష వారి కవిత గానంతో అలరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకులు బాలరాజు, లలితా సరస్వతి, గ్రంథాలయాధికారి మధు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
Arattai