అమరావతి, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ (RTGS)లో అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు.
వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయం (పబ్లిక్ పర్సెప్షన్)పై ప్రత్యేకంగా చర్చించిన సీఎం… సోషల్ మీడియా, వార్తాపత్రికలు, ఇతర మాధ్యమాల్లో ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను నిమిషం నిమిషానికీ విశ్లేషించి, వాటిపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

“ప్రజల నుంచి వస్తున్న ప్రతి సమాచారాన్ని సీరియస్గా తీసుకోవాలి. దాన్ని విశ్లేషించి, మరింత మెరుగైన సేవలు అందేలా చూడాలి. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎక్కడా రాజీకి తావులేదు” అని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు.
సమీక్షలో ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మున్సిపల్ సేవలు, రోడ్లు-భవనాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మీడియాలో వచ్చిన ప్రతికూల వార్తలు, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించేలా ప్రతి శాఖకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు

.
“పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ను మరింత పెంచుకోవాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉంది. ప్రజలు మన సేవల గురించి మంచిగా మాట్లాడేలా చేయాలి” అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘటించారు.
ఈ సమీక్ష ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు మరింత పకడ్బందీగా, ప్రజలకు చేరువయ్యేలా చూడాలనే సంకల్పం మరోసారి స్పష్టమైంది.
Arattai