వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు
చలి తీవ్రత దృష్ట్యా వేడి ఆహారం మాత్రమే ఇవ్వండి
హాస్టళ్లను ఉన్నతాధికారులు తరుచూ సందర్శించాల్సిందే : మంత్రి సవిత ఆదేశం
AMARAVATHI Dec 15 :- రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రాబట్టాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సమాయత్తం చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఫలితాలతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏబీసీడబ్ల్యూఈవోలు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఎంజేపీ కన్వీనర్లు, ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ కార్యదర్శి మాధవీలతతో కలిసి మంత్రి సవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో జిల్లాల వారీగా ఆయా హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల్లో తీసుకుంటున్న చర్యలు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత విద్య సంవత్సరంలో వచ్చిన ఉత్తీర్ణతా శాతాన్ని తెలుసుకుంటూ, వచ్చే పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణ సాధించాలని దిశా నిర్దేశం చేశారు.

రిజల్ట్ తో పాటు విద్యార్థులంతా ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణలయ్యేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడిన ఉన్నారో తెలుసుకుని, ఆయా సబ్జెక్టుల్లో వారు పట్టు సాధించేలా బోధన సాగించాలన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ఎంతో ముఖ్యం
ప్రస్తుతం రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలన్నారు. విశ్రాంత, తరగతి గదుల్లో దోమలు చొరబడకుండా ద్వారాలు, కిటికీల దగ్గర దోమ తెరలు వాడాలన్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ లు చేయించాలన్నారు. హాస్టళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, తరవాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని మంత్రి స్పష్టంచేశారు. బయట ఆహారం హాస్టళ్లలోనికి రానివ్వొద్దని, అదే సమయంలో విద్యార్థులను బయటకు పంపకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు వచ్చినప్పుడే వారితో బయటకు పంపాలన్నారు. విద్యా భోధనతో పాటు హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం, సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యంపై వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు.

హాస్టళ్లను తరుచూ సందర్శించండి…
ఏబీసీడబ్ల్యూఈవోలు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఎంజేపీ కన్వీనర్లు తరుచూ తమ పరిధిలో ఉన్న హాస్టళ్లను, గురుకులాలను సందర్శించాలని మంత్రి సవిత ఆదేశించారు. హాస్టళ్లను ఉన్నతాధికారులు తరచూ సందర్శించడం వల్ల వార్డెన్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారన్నారు. వార్డెన్లు రాత్రిళ్లు హాస్టళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిళ్లు హాస్టళ్లలో లేని వార్డెన్లను ఉపేక్షించేది లేదని, విద్యార్థుల భద్రత ఎంతో ముఖ్యమని స్పష్టంచేశారు. డీబీసీడబ్ల్యూఈవోలు తమ జిల్లాల కలెక్టర్లను కలిసి, సీఎస్సార్ ఫండ్స్ సేకరణకు కృషి చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులు, అన్ని జిల్లాల ఏబీసీడబ్ల్యూఈవోలు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఎంజేపీ కన్వీనర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు…
అంతకుముందు అమరజీవి పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి సవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దీక్ష చేపట్టి ఆత్మార్పణ చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన వదిలిన ఊపిరే తెలుగు వారి శ్వాస అని అన్నారు. అమరజీవి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శమని, ఆయన లక్ష్య సాధనకు అందరమూ కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

Arattai