NANDYAL :-0-5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారి బంగారు భవిష్యత్తుకు నిండు నూరేళ్లు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 0-5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా 1995 సంవత్సరం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, పోలియో రహిత దేశంగా భారత్ నిలవాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వాల నిరంతర కృషి ఫలితంగా ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని అన్నారు.

పోలియో వ్యాధి మూడు రకాలుగా (టైప్–1, టైప్–2, టైప్–3) ఉంటుందని, ఇందులో టైప్–2, టైప్–3 రకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పూర్తిగా నిర్మూలించబడినట్లు తెలిపారు. అయితే టైప్–1 రకం ఇప్పటికీ కొన్ని చుట్టుపక్కల దేశాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలియో పూర్తిగా అంతరించిపోయిందన్న భావన ప్రజల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తు కోసం రెండు పోలియో చుక్కలు తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ఏడాది జిల్లాలో 2 లక్షల 35 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల సౌకర్యార్థం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో 46 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణాల్లో ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పుట్టిన వెంటనే శిశువుకు కూడా రెండు పోలియో చుక్కలు వేయవచ్చని, 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు.

ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకోలేని కుటుంబాల వద్దకు రేపటి నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పుట్టిన ప్రతి పిల్లవాడికి ప్రభుత్వం సూచించిన అన్ని టీకాలు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆశా, ఏఎన్ఎం, వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి టీకాల గురించి పూర్తి సమాచారం ఇస్తారని చెప్పారు. టీకాలు వేస్తే పిల్లలకు జ్వరం వస్తుందన్న అపోహలను నమ్మవద్దని, ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్లను పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాహారం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ప్రభుత్వం కూడా అదే రీతిలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సౌకర్యాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
Arattai