NANDYAL Dec22:- బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం, బాలికలపై లైంగిక వేధింపుల నిర్మూలనపై అవగాహన, టోల్ ఫ్రీ నంబర్ల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న వేధింపులను నిరోధించే చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమాజంగా బాధ్యత తీసుకొని ఈ అకృత్యాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.
నేటి సమాజంలో బాలికలు, యువతులపై జరుగుతున్న వేధింపులు, ఆత్మహత్యాయత్నాలు, బలవన్మరణాలు వంటి సంఘటనలపై మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో బాలికలపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే అరికట్టాలంటే అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
అవసర సమయంలో 1098 (చైల్డ్ హెల్ప్ లైన్), 112 (దిశా హెల్ప్ లైన్), 181 (ఉమెన్ హెల్ప్ లైన్), 100 (ఏపీ పోలీస్ డయల్), 108 (ఎమర్జెన్సీ సేవలు), 104 (మెడికల్ హెల్ప్ లైన్) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పోక్సో సవరణ చట్టం-2012లోని సెక్షన్ 17 ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ పీడీ లీలావతి ఆధ్వర్యంలో అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్లకు, టీచర్లకు సాంసంగ్ ఫైవ్–జీ సెల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
Arattai