NANDYAL April11 :- సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జయంతోత్సవ సభను మంత్రి, కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ మాట్లాడుతూ పూలే గారు భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. కుల, మత వివక్షలను ఎదుర్కొంటూ సమాన హక్కుల కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన సాధనమని పూలే గారు చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ, సామాజిక సంస్కరణలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ముఖ్యంగా మహిళల సాధికారతకు తీసుకున్న చర్యలు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన అవకాశాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. మైనారిటీల కోసం గురుకుల విద్యా సంస్థలు, ఆరోగ్య సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దారితీసినవని వివరించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. స్త్రీ విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. “ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది” అనే భావనను ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలు ఇంకా కొంతవరకు కొనసాగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళలను కనీసం డిగ్రీ స్థాయి వరకు చదివించి, వారు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబడేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. జ్యోతిబా పూలే పేరుతో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా బాలికల విద్యాభివృద్ధి కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు. విద్యార్థుల పోషణ కోసం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’, అవసరమైన విద్యాసామగ్రి కోసం ‘విద్యార్థి మిత్ర’ పథకం అమలు అవుతున్నాయని తెలిపారు. డిజిటల్ బోధన విధానాల ద్వారా విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పుస్తక పఠనం అలవాటు ద్వారా జ్ఞానం పెరగడంతో పాటు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని, యువత దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారి జీవితం సామాజిక న్యాయం కోసం సాగిన నిరంతర పోరాటానికి ప్రతీక అని అన్నారు. బాల్య వివాహాలు, కుల అసమానతలు, వితంతు వివాహాల నిషేధం వంటి అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం సమాజాన్ని మార్పు దిశగా నడిపిందన్నారు. ఈ మార్పుకు మూలం విద్య మరియు చైతన్యమేనని, భావితరాలకు ఈ విలువలను చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్ నాయుడు తదితరులు జ్యోతిరావు పూలేను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Arattai