NANDYAL April13 :- పోషణ పక్షోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యం, పోషణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోషణ పక్షోత్సవాలకు సంబంధించిన గోడప్రచార పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి దేవి, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 9 నుండి 23 వరకు పోషణ పక్షోత్సవాలను “క్యాంపెయిన్ మోడ్”లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, డీఆర్డీఏ, మెప్మా (MEPMA), పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని చెప్పారు. సమాజంలో మారుతున్న తరాలైన జనరేషన్ జెడ్ (Gen Z), జనరేషన్ ఆల్ఫా (Gen Alpha), జనరేషన్ బీటా (Gen Beta) పిల్లల ఆరోగ్యం, పోషణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

జంక్ ఫుడ్ ప్రభావం
ప్రస్తుతం పిల్లలు బింగో, లేస్, కుర్కురే వంటి ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారని, వీటిలో సోడియం నైట్రేట్, సోడియం బెంజోయేట్ వంటి హానికర రసాయనాలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతోందని హెచ్చరించారు. వీటి వినియోగం వల్ల చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తెలిపారు.
స్క్రీన్ టైమ్ ప్రభావం
పిల్లల మెదడు అభివృద్ధిలో గర్భధారణ నుండి రెండు సంవత్సరాల వరకు ఉండే మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే 80 శాతం మెదడు అభివృద్ధి జరుగుతుందని, మిగిలిన అభివృద్ధి ఐదేళ్ల వయస్సు వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ దశలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల పిల్లల్లో మాటల ఆలస్యం, భావోద్వేగ సమస్యలు, ప్రవర్తనా మార్పులు, ఆటిజం లక్షణాలు కనిపించే అవకాశముందని తెలిపారు. కాబట్టి గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అధిక స్క్రీన్ టైమ్ వల్ల కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని అన్నారు.
కథల ప్రాముఖ్యత
పిల్లల సమగ్ర అభివృద్ధిలో కథల పాత్ర ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దలు కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, భాషా పటిమ మరియు సృజనాత్మకత పెరుగుతాయని చెప్పారు.
అంతకుముందు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి దేవి మాట్లాడుతూ, పిల్లలను ఆరోగ్యంగా పెంచేందుకు జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం ఇవ్వాలని సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి, కథలు చెప్పే పాత సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్ల ద్వారా ఈ అవగాహనను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.
Arattai