NANDYAL April 24 :- భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, హైదరాబాద్ స్టార్ హాస్పిటల్, స్టార్ లివర్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రైవేట్ హోటల్ సమావేశ భవనంలో వైద్య సదస్సు నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ సదస్సులో జాతీయ ఐ.ఎం.ఎ. కేంద్ర కమిటీ సభ్యులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ సదస్సు ప్రారంభించారు.

లివర్ వైద్యనిపుణులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎలుకల మందు తాగిన వారిలో లివర్ పై ప్రభావం అంశంపై, లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రఘురాం రెడ్డి లివర్ ఫెయిల్యూర్ లో లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆవశ్యకత గురించి, ఇంటర్వెషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురేష్ హార్ట్ ఫెయిల్యూర్ లో నూతన చికిత్స విధానాలు అంశంపై మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ, కొత్తగా ఆవిష్కరించిన ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకోసమే ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు నిరంతర వైద్య విద్యా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా వక్తలను ఐఎంఏ నంద్యాల తరఫున జ్ఞాపికలు అందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ మహమ్మద్ రఫీ లతోపాటు ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,నంద్యాల ఐ.ఎం.ఎ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్,స్టార్ ఆసుపత్రి ప్రతినిధి ఫక్రుద్దీన్,అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
Arattai