NANDYAL May 31 :- ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఏ), మిడ్ టౌన్ రోటరీ క్లబ్ మరియు గ్రీన్ సొసైటీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఐడిఏ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డి.వి. సుబ్బయ్య, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ కార్యదర్శి ఆర్. వెంకటేశ్వర్లు, గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ బ్రాంచ్ ఆధ్వర్యంలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ పొగాకు వినియోగం నోటి క్యాన్సర్తో పాటు అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని చిన్న పిల్లలు,యువత పొగాకు ఉత్పత్తులకు బానిసలు కాకుండా ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించవలసిన అవసరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైన ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలు,కళాశాలల్లో కరపత్రాల ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. చర్చా కార్యక్రమంలో డి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పొగాకు వ్యసన నిర్మూలన అత్యవసరమన్నారు. గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు పర్యావరణం, ప్రజారోగ్యంపై పొగాకు దుష్ప్రభావాలను వివరించారు. రోటరీ క్లబ్ కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర్లు సమాజంలోని ప్రతి వర్గం అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాస రెడ్డి , వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు, కవులు కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, మహబూబ్ బాష, అవ్వారి శేషఫణి పొగాకు వ్యతిరేక సందేశాలతో కూడిన చైతన్య కవితలను వినిపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, నరసింహులు, రామసుబ్బయ్యతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Arattai