గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ‘మ్యాజిక్ డ్రెయిన్స్’తో శాశ్వత పరిష్కారం:జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL July29 :- గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేసి, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ నిర్మాణాన్ని చేపట్టి, అపరిశుభ్రత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో సిమెంట్ కాంక్రీట్ రహదారులు నిర్మించినప్పటికీ, మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవడం వల్ల అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా “మ్యాజిక్ డ్రెయిన్స్” నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో అనువైన స్థలాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, వీలైనంత త్వరగా మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మాణ పనులను ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంక్షేమ పథకాల అమలులో జిల్లాలు మెరుగైన ప్రగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యయాలను సకాలంలో నమోదు చేయడంతో పాటు, అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా లేదా ఇతర అడ్డంకులను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
అదేవిధంగా శానిటరీ కాంప్లెక్స్‌లు, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాకు మంజూరైన ఈ పనులన్నింటిలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ లక్ష్యాలను నిర్దేశించుకుని గడువులోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Arattai