ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (SIR) 2026 నోటీసులు, హియరింగ్ పై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
NANDYAL Aug10 :- ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision–SIR)–2026 పక్రియ విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్ఓ అధికారులను జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా అభినందించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల BLOలు, AEROలు,ERO, BL తో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision–SIR)–2026లో భాగంగా నోటీసుల జారీ, హియరింగ్ పై సమీక్షoచిన జిల్లా కలెక్టర్.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయినందున, తదుపరి దశలో క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫారం-6, ఫారం-6A, ఫారం-7, ఫారం-8 ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించి, వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించాలన్నారు.
జిల్లాలో మొత్తం 14,05,443 మంది ఓటర్లతో SIR ప్రక్రియ ప్రారంభించగా, 12,25,937 మంది (87.23 శాతం) ఓటర్లు నిజమైన ఓటర్లుగా గుర్తించబడ్డారని తెలిపారు. మిగిలిన వారిని అబ్సెంట్, పర్మనెంట్‌గా ఇతర ప్రాంతాలకు తరలిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు నమోదు కావడానికి ఆసక్తి లేని వారు అనే ఐదు కేటగిరీలుగా గుర్తించినట్లు వివరించారు.ఈ కేటగిరీల్లో చేర్చిన ఓటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అటువంటి అభ్యంతరాలు వచ్చిన వెంటనే BLO, AERO స్థాయిలో నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా 2002 ఓటర్ల జాబితాతో స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా మ్యాపింగ్ చేయలేని 6,067 మంది ఓటర్లు (0.43 శాతం) ఉన్నారని తెలిపారు. వీరందరికీ కూడా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మ్యాపింగ్ ప్రక్రియను ముందుగానే పూర్తి చేయడం వల్ల అధికారులపై పని భారం తగ్గుతుందని, ఆళ్లగడ్డ నియోజకవర్గం మ్యాపింగ్‌ను 100 శాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. నిజమైన ఓటర్లుగా గుర్తించిన 12,25,937 మందిలో 74,073 మంది ఓటర్ల డేటాలో లాజికల్ డిస్క్రిపెన్సీలు ఉన్నాయని తెలిపారు. మ్యాపింగ్ పెండింగ్‌లో ఉన్న 6,067 మందితో కలిపి మొత్తం 80,140 మందికి నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించాల్సి ఉందని చెప్పారు.
ఒకవైపు నోటీసుల ప్రక్రియ, మరోవైపు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన కొనసాగుతున్నందున అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో 5,182, బనగానపల్లెలో 3,051, డోన్‌లో 3,105 క్లెయిమ్స్ వచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో క్లెయిమ్స్, అభ్యంతరాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.
SIR షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3న ప్రచురించాల్సి ఉందని కావున , సెప్టెంబర్ 28 వరకు వేచి ఉండకుండా, సెప్టెంబర్ 10 నాటికే నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాలు, డిస్క్రిపెన్సీలకు సంబంధించిన పనులను వీలైనంత వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నోటీసుల జారీలో 7 రోజుల గడువు తప్పనిసరి
80,140 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులో ఓటరు ఏ తేదీన, ఏ సమయానికి విచారణకు హాజరు కావాలో స్పష్టంగా పేర్కొంటూ హియరింగ్ షెడ్యూల్ ఇవ్వాలన్నారు.సహజ న్యాయ సూత్రాలను పాటించేందుకు నోటీసు అందించిన తేదీ నుంచి కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా హియరింగ్ తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. నోటీసు జారీ చేసిన వెంటనే మరుసటి రోజే విచారణకు షెడ్యూల్ చేయడం సరికాదని స్పష్టం చేశారు.
నోటీసులు జనరేట్ చేయడమే కాకుండా, అవి సంబంధిత ఓటరుకు వాస్తవంగా అందినట్లు కూడా నిర్ధారించుకోవాలని తెలిపారు. BLOలు నోటీసులను అందజేసిన అనంతరం, నోటీసు డెలివరీకి సంబంధించిన ఆధారాలను సక్రమంగా అప్లోడ్ చేయాలని సూచించారు.AERO లు నోటీసులు జారీ చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించేలా ERO లు వారికి తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలని, ప్రతి దశను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. నోటీసు జారీ, హియరింగ్ షెడ్యూల్, నోటీసు డెలివరీ, డెలివరీ ఆధారాల అప్లోడింగ్ వంటి ప్రతి ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లకు న్యాయం జరిగేలా, పారదర్శకంగా మరియు నిబంధనలకు అనుగుణంగా విచారణ ప్రక్రియను పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
Arattai