జిల్లా కలెక్టర్ రాజకుమారికి గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం
NANDYAL Sep01:- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రెడ్‌క్రాస్ బంగారు పతకం, ప్రశంసా పత్రం లభించింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో 2024-25 సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెడ్‌క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్లను గవర్నర్ సత్కరించారు.

నంద్యాల జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమం అమలు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు కలెక్టర్ రాజకుమారికి ఈ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీకి సొంత భవనం, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రజలకు అనేక సేవలు అందించే స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కు చెందిన పాత జపాన్ ప్రాజెక్టు భవనాన్ని రెడ్‌క్రాస్ సొసైటీకి కేటాయించి, అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సొంత భవనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా ఫ్రీజర్లు, ఏసీలు, ల్యాబ్ టెక్నీషియన్ తదితర సదుపాయాలతో బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. యువత, మహిళల్లో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

రెడ్‌క్రాస్ భవనానికి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు NEDCAP మార్గదర్శకత్వంలో పూర్తిస్థాయి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా GGH ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

భవిష్యత్‌లో డోన్, శ్రీశైలం ప్రాంతాలతో పాటు NH-40, NH-340C జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.డి. రామారావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీఈఓ అశ్విని కుమార్ ఫరీదా (రిటైర్డ్ ఐఏఎస్), రాష్ట్ర వైస్ చైర్మన్ పి.ఆర్.సి. రాజు, నంద్యాల జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, ఉస్మాన్ భాషతో పాటు రెడ్‌క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Arattai