నంద్యాలలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం
NANDYAL Sep03:- నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి ఫయాజ్ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి అమరావతి క్రీడా పోటీలలో బాక్సింగ్ లో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు పతకం, నాలుగు రజత పతకాలు సాధించి , విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల తర్వాత తృతీయ స్థానంలో నిలవడం నంద్యాలకు గర్వకారణం అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తున్నందుకు క్రీడా సంఘాల తరఫున డాక్టర్ రవి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. నంద్యాలలో బాక్సింగ్ శిక్షణ శిబిరాలు, రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు .డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారులు మహమ్మద్ అలీ, మేరీ కోమ్ లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని నిరంతర సాధన ద్వారా ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తమ ఆడిటోరియం క్రీడలకు కూడా వినియోగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

నంద్యాల జిల్లా బాక్సింగ్ కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ ఈ పోటీలలో కర్నూలు,నంద్యాల, అన్నమయ్య మూడు జిల్లాల నుండి 150 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని, బాలురకు, బాలికలకు వేరువేరుగా వివిధ వెయిట్ కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్ తో పాటు, నంద్యాల పట్టణ కార్యదర్శి నూర్ భాషా, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్, అహోబిలం జడ్పీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర, అన్నమయ్య జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఆనంద్ , బాక్సింగ్ కోచ్ లు, రెఫరీలు ఉపేంద్ర, గణేష్, చంద్ర, జస్వంత్, పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai