జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా
NANDYAL Sep08:- జిల్లాలో 100 శాతం నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు, వాలంటీర్లు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు సమిష్టి కృషితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అక్షరజ్ఞానం కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదని, అది వ్యక్తిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, సాధికారతను పెంపొందించి మెరుగైన జీవనానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరూ విద్యకు దూరంగా ఉండకుండా, చదువులో వెనుకబడిన ప్రతి ఒక్కరూ అక్షరజ్ఞానం పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సర్వే ద్వారా జిల్లాలో సుమారు 3.50 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారందరినీ మూడు సంవత్సరాల కాలంలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో “ఉల్లాస్” (అక్షరాంధ్ర) కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. గత ఏడాది నిర్వహించిన ఫేజ్-1లో లక్ష మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత అందించే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని పేర్కొన్నారు.

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని “అక్షరాంధ్ర ఫేజ్-2”ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దశలో సుమారు 1.12 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నామని, మిగిలిన లక్ష్యాన్ని వచ్చే ఏడాది ఫేజ్-3లో పూర్తి చేసి జిల్లాను 100 శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. ముందుగా అక్షరాలను గుర్తించడం, బోర్డులు, బస్సుల పేర్లు చదవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను అలవర్చుకోవడంతో చదవడం, రాయడంపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. కేవలం సంతకం చేయడం వరకు పరిమితం కాకుండా అక్షరాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకు ఫారాలు నింపడం, ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడం, యూపీఐ చెల్లింపులు, మొబైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి దైనందిన అవసరాలకు ప్రాథమిక అక్షరాస్యత ఎంతో అవసరమని తెలిపారు. అక్షరజ్ఞానం లేకపోవడం వల్ల ఎవరూ మోసపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికీ కనీస అక్షరాస్యత కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా సంఘాల్లోని చదువుకున్న సభ్యులు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న చదువుకున్న వారిని వాలంటీర్లుగా ఎంపిక చేసి అభ్యాసకులకు బోధన అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాలంటీర్లకు 8 పాఠాలతో కూడిన పుస్తకాలను అందించడంతో పాటు అభ్యాసకుల కోసం 32 సాధన పత్రాలు, 4 మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించినట్లు చెప్పారు. పగటిపూట పనులకు వెళ్లే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనుకూలమైన సమయంలో రోజుకు అరగంట నుంచి గంట వరకు బోధన అందించాలని సూచించారు. వచ్చే మార్చిలో నిర్వహించే తుది పరీక్షలకు అభ్యాసకులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని, పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు బొమ్మలు-అక్షరాలను జత చేయడం, సరళమైన కూడికలు, తీసివేతలు వంటి సులభమైన పద్ధతుల్లో అభ్యాసం కల్పించాలని తెలిపారు. డిజిటల్ హాజరు నమోదు కోసం ప్రత్యేక యాప్ను వినియోగించాలని సూచించారు.

నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని, పిల్లలను చూసి తల్లిదండ్రులు, తోటివారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొంది చదువుకున్న అనేక ఉదాహరణలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి “ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు – ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం” అనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, టీమ్ సభ్యులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బృందాలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డీడీ చంద్రశేఖర్ రెడ్డి, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఎల్డీఓ శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీఓ ఫణికుమార్ నాయక్ తదితర అధికారులు పాల్గొని అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించారు.

Arattai