నంద్యాలలో గ్రంథాలయ ఉద్యమ ప్రేరణదాత గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి
NANDYAL Sep14 :- స్వాతంత్ర్య సమరయోధుడు, గ్రంథాలయ ఉద్యమ ప్రేరణదాత, పాత్రికేయుడు, సాహితీవేత్త గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతిని పురస్కరించుకుని నంద్యాలలోని పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో సోమవారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని, సామాజిక స్పృహను, పఠనాసక్తిని పెంపొందించేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. దేశభక్తి, స్వేచ్ఛ, ప్రజా చైతన్యం, గ్రంథాలయ ఉద్యమం వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన కృషి నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా నంద్యాలతో గాడిచర్లకు ఉన్న అనుబంధం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని తెలిపారు. సాహితీ స్రవంతి కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు జీవితమే ఒక చైతన్య దీపిక అని అన్నారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను, జ్ఞాన తృష్ణను రగిలించిన మహనీయుడిగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు భద్రపరిచే కేంద్రాలు కాకుండా సమాజ చైతన్యానికి వేదికలుగా మారాలన్న గాడిచర్ల ఆశయాలను నేటి తరంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీ సైన్స్ అధ్యాపకునిగా విశేష సేవలు అందిస్తూ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తున్న శ్రీ వెంకటేశ్వర్లును సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గ్రంథాలయ రంగంలో ఆయన అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ స్కూల్ అధినేత డి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ, పుస్తకం మనిషి ఆలోచనా విధానాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని, అలాంటి పఠన సంస్కృతిని సమాజంలో విస్తరించడమే గాడిచర్లకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. గ్రంథాలయ అధికారి మధు మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యమానికి గాడిచర్ల అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు జీవితం దేశభక్తి, సామాజిక బాధ్యత, సాహిత్య సేవ, ప్రజా చైతన్యానికి సమన్వయ రూపమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు పరిచయం చేయడం ద్వారా జాతీయ భావాలను మరింత బలోపేతం చేయవచ్చన్నారు.విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రామసుబ్బయ్య, బాలరాజు, శ్రీమతి లలితా సరస్వతి తదితరులు పాల్గొని గాడిచర్లకు ఘన నివాళులు అర్పించారు.గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా నంద్యాల సాహితీ, విద్యా, గ్రంథాలయ రంగాలకు ఆయన చేసిన సేవలను మరోసారి స్మరించుకోవడంతో పాటు, పఠన సంస్కృతి మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నిర్వాహకులు చాటిచెప్పారు.
Arattai