ఎస్సీ, ఎస్టీ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Sep22 :- ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను సున్నితంగా పరిగణించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (DVMC) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులు, వాటి విచారణ పురోగతి, బాధితులకు అందుతున్న న్యాయపరమైన, ప్రభుత్వపరమైన సహాయం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రస్తావించిన సమస్యలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో గుర్తించిన సమస్యలపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి, తీసుకున్న చర్యలు మరియు పురోగతిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సఫాయి కర్మచారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
సఫాయి కర్మచారుల సమస్యలపై చర్చిస్తూ, వారికి PF, ESI తదితర సామాజిక భద్రతా ప్రయోజనాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ESI, PF వంటి సౌకర్యాలను అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సానిటేషన్ వర్కర్లకు నిబంధనల ప్రకారం పని దినాలు, సెలవులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతున్న అంశంపై స్పందిస్తూ, పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తాగునీటి సౌకర్యాల కల్పనకు చర్యలు
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ప్రాంతాల్లో RO వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నంద్యాల పట్టణ పరిధిలో RO ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్న విస్తీర్ణంలో ఉన్న స్థలాలను కూడా పరిశీలించి, సాధ్యమైన చోట్ల తాగునీటి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ బాధితుల సమస్యలను సున్నితంగా పరిగణించి, వారికి అవసరమైన న్యాయపరమైన, ప్రభుత్వపరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన విచారణ పూర్తి చేసి పరిష్కరించేలా సంబంధిత SDPOలను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివారెడ్డి, ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, నరేంద్రనాథ్ రెడ్డి, డివియంసీ కమిటీ సభ్యులు నాగరాజు, కాశన్న, రవికాంత్ బాబు, రమేష్ నాయక్, నాగ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Arattai