భారత హాకీ చరిత్ర- ధ్యాన్ చంద్ ప్రాముఖ్యత” అంశంపై 4 వ తేది తెలుగులో వ్యాసరచన,6 వ తేదీన ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు.
నంద్యాల కు చెందిన హాకీ వెటరన్ క్రీడాకారులకు సత్కారం
గిన్నిస్ బుక్ రికార్డు దిశలో ఏడవ తేదీ దేశవ్యాప్తంగా నంద్యాల తో సహా 1000 మైదానాలలో హాకీ మ్యాచ్ ల నిర్వహణ
భారత జాతీయ హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నంద్యాలలో ఎస్ పి జి స్కూలు మైదానంలో నవంబర్ 7వ తేదీ నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో నంద్యాల హాకీ సంఘం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ నవంబర్ 7వ తేదీ నిర్వహించే కార్యక్రమాలు వివరించారు.

భారత హాకీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు కోసం దేశవ్యాప్తంగా నవంబర్ 7వ తేదీ వెయ్యి హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని, నంద్యాలలో కూడా ఆరోజు హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజు నంద్యాల నుండి హాకీలో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో పాల్గొన్న పూర్వ క్రీడాకారులను సత్కరించడం జరుగుతుందన్నారు.
ఈ ఉత్సవాలలో భాగంగా నంద్యాల లో ఉన్న హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు “భారత హాకీ చరిత్ర – హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ప్రాముఖ్యత ” అంశంపై 4 వ తేదీ తెలుగులో వ్యాసరచన పోటీలు, ఆరవ తేదీ అదే అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు ఏడవ తేదీ ఎస్పీజీ మైదానంలో జరిగే ఉత్సవంలో బహుమతి ప్రధానం చేస్తామన్నారు.

భారతదేశం హాకీలో 1928 నుండి 1964 వరకు వరుసగా ఏడుసార్లు ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిందని తిరిగి 1980లో మరొకసారి బంగారు పతకం సాధించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఒకసారి రజత పతకం నాలుగు సార్లు కాంస్య పతకాలు భారతదేశ ఒలింపిక్స్ లో సాధించిందని వివరించారు.విద్యార్థులలో,యువతలో జాతీయ క్రీడ అయిన హాకీ పై ఆసక్తి పెంచాలనే ఆశయంతో శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
రానున్న కాలంలో భారతదేశం పురుషులు ,మహిళల రెండు విభాగాలలో కూడా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అందుకోసం హాకీ ఇండియా విశేషంగా కృషి చేస్తున్నదని అన్నారు.
హాకీ ఆంధ్ర అధ్యక్షులు చాణక్య రాజు పర్యవేక్షణలో, నంద్యాల హాకీ సంఘం అధ్యక్షులు పాల్ రాజారావు, కార్యదర్శి ముత్యంరాజు, సంయుక్త కార్యదర్శి దివాకర్, ఉపాధ్యక్షులు స్టీఫెన్,కోచ్ శ్రావణ్, కార్యవర్గ సభ్యుడు కెనడి లు ఉత్సవాల నిర్వహణ ఏర్పాటు చేస్తున్నారు.
పాత్రికేయ సమావేశంలో చాణక్య రాజు, డాక్టర్ రవికృష్ణ లతోపాటు, నంద్యాల హాకీ సంయుక్త కార్యదర్శి జెడ్.ఎస్.పి.దివాకర్, ఉపాధ్యక్షులు స్టీఫెన్,కోచ్ శ్రావణ్ పాల్గొన్నారు.
Arattai