నవనందుల క్షేత్రం నంద్యాల నవరసాలు పలికించే ప్రాంతమని ప్రముఖ శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు. చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వేంకట రమణమూర్తి రచించిన మూడు పుస్తకాలు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ డాక్టర్ రమణ మూర్తి గారు రచించిన నాయనారుల చరిత్ర, ఆళువారుల కథలు, వైష్ణవ శాకుంతలమ్ , సాహిత్య అభిమానుల మధ్య ఆవిష్కరించడం సంతోషదాయకమన్నారు. రమణమూర్తి గారు గతంలో అళువార్ల చరిత్ర పద్య కావ్యం రాసారని ఇప్పుడు నాయనారుల చరిత్రను సులభశైలిలో పద్య కావ్యంలో తీసుకురావడం తెలుగు ప్రజల అదృష్టం అన్నారు.

రచయిత డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పద్యంపై ఆసక్తితో నాయనారుల చరిత్ర రచించాను అన్నారు. ఆధునిక కావ్య జగత్తులో నాయనారుల చరిత్రకు రమణీయస్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అవధాని డాక్టర్ గంగుల నాగరాజు మాట్లాడుతూ నాయనార్లు శివ భక్తులుగా ప్రసిద్ధులని శివతత్వంలోని సారాంశాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం సంతోషదాయకమన్నారు. కవి కోలం మధుసూదన్ మాట్లాడుతూ సరళ శైలిలో పద్యములను హృద్యంగా చెప్పే ఘనత రమణమూర్తి గారికి దక్కుతుందన్నారు.

సుధాకర్ రెడ్డి, నాగరాజు, బి బి ఎస్ ప్రసాదులు ఆళ్వారుల కథలు, నాయనార్ల చరిత్ర, వైష్ణవ శాకుంతలమ్ పుస్తకాలను సమీక్షించారు. వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు, కవులు రచయిత వైష్ణవ వేంకటరమణమూర్తి, శకుంతల దంపతులను ఘనంగా సన్మానించారు.
గాయకులు శేషాచార్యులు, మహబూబాషా, నీలకంఠమాచారి రమణమూర్తి కవి జీవిత విశేషాలతో పాటు తెలుగు భాష వైభవాన్ని తెలిపే కవితలు వినిపించారు.
కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ ఉదయ్ శంకర్, శశిభూషణ సిద్ధాంతి, రామ మాణిక్యం శర్మ, పాణ్యం శ్రీనివాసరావు, కర్నాటి చంద్రమౌళిని, సుధీంద్ర, ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, అవ్వారి శేషఫణి, నీలం వెంకటేశ్వర్లు, రచయిత కుటుంబ సభ్యులు శ్రీనాథ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Arattai