NANDYAL Nov 25:-రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకుంటే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, ఇందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన అధ్యక్షతన నిర్వహించిన రహదారి భద్రతా సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, ఎఎస్పీ యుగంధర్ బాబు, డీఎస్పీ ప్రమోద్ కుమార్, డిటిసి శివారెడ్డి, ఎన్‌హెచ్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల తగ్గింపులో ప్రజల్లో అవగాహన కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. గత సమావేశంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని నాలుగు సర్వీస్ రోడ్ల వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. చాపిరేవుల, కోవెలకుంట్ల ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేయగా, మిగతా రెండు ప్రాంతాల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్–40 అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖలకు ఆయన సూచించారు. శాంతిరాం ఆసుపత్రి సమీపంలో రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, అవసరమైన లైటింగ్ పెంచాలని ఆదేశించగా, 10 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్ అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్–44 మార్గంలో డోన్ మండలం, దొరపల్లి గ్రామం వద్ద మెరుగైన విద్యుత్ సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ఇందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు వివరించారు.

బ్రాహ్మణకొట్కూరు ప్రాంతంలో ఎన్‌హెచ్–340సి రహదారి కారణంగా రైతులు సాగు భూములకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రజా పరిష్కార వేదికకు అర్జీలు వచ్చినందున వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రహదారులపై తిరుగుతున్న పాడిపశువులను తొలగించేందుకు పోలీసు శాఖ సహకారంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, రహదారి నిర్మాణ సమయంలో గ్రామాల ఇరువైపుల ప్రజల రాకపోకలకు అనుకూలంగా అండర్‌పాసులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న సర్వీస్ రోడ్లను తక్షణం పునరుద్ధరించాలని ఎన్‌హెచ్ అధికారులను కోరారు.
Arattai