NANDYAL Dec 02:-రబీ సీజన్లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖా మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, కేసీ కెనాల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి ఎస్ఆర్బిసి చైర్పర్సన్ కె. రాజశేఖర్ రెడ్డి, సాగునీటి సంఘాల నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రబీ పంటలకు సాగునీరు అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన పిదప వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు. కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, తెలుగు గంగ ఆయకట్టుల్లో ఎంతమేరకు నీరు విడుదల చేయాలి అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా సమీక్షించామన్నారు.
ఎస్సార్బీసీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేసీ కెనాల్ పరిధిలో తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు కొత్తగా నిర్మించడంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందువల్ల 0–120, 120–150 కిలోమీటర్ల వరకు ఈ సీజన్లో నీటివిడుదల సాధ్యం కాదని ఎమ్మెల్యేలకు సూచించారు

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఏవైనా సమస్యలు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు గంగ ఆయకట్టు పరిధిలో మార్చి చివరి వరకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు.
తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు చాలా సంవత్సరాల క్రితం నిర్మించడంతో పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆ కారణంగా కర్ణాటక–ఏపీ ప్రభుత్వాల సమన్వయంతో కొత్తగా గేట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఏ ప్రాజెక్ట్ మరమ్మత్తుల సమయంలోనైనా కొంతకాలం ఇబ్బందులు తలెత్తడం సహజమని, ఈ పరిస్థితిని రైతు సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలు రాకుండా ఉండేందుకు తుంగభద్ర బోర్డు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి సహకారం అందిస్తున్నదని తెలిపారు. రివర్స్ పంపింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని, ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చిస్తామని మంత్రులు పేర్కొన్నారు.
రైతు ప్రయోజనం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగిస్తామని స్పష్టం చేశారు. గతంలో రైతులకు నీటి సంఘాల సమావేశాలకు ఆహ్వానం ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయినా, నేడు ప్రభుత్వమే రైతులను ఆహ్వానించి వారి సూచనలు స్వీకరిస్తున్నదని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సిద్ధాంతంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నదని, వారికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఖరీఫ్ సీజన్లో నీటిపారుదల, ఆరుతడి పంటల ప్రణాళిక ప్రకారం ఆయకట్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ) ద్వారా రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

తెలుగు గంగ ప్రాజెక్ట్ పరిధిలో మార్చి 31 వరకు సాగునీరు అందించే వీలున్నదని, ఇప్పటికే శ్రీశైలం మండలంలోని వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాల్లో వరి సాగు ప్రారంభమైనప్పటికీ, దిగువనున్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వరి సాగునీరు ఇవ్వడం సమస్యగా ఉన్న కారణంగా ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పు పనుల కారణంగా 0 నుండి 150 కిలోమీటర్ల మధ్య ఉన్న 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడం కష్టసాధ్యమైందని, ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
అలాగే 0–120 కి.మీ పరిధిలోని మల్యాల, ముచ్చుమర్రిలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు అందించే అవకాశమూ చాలా తగ్గిపోయిందని, ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు వేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులకు ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.150 నుండి 305 కిలోమీటర్ల వరకూ మిగిలిన ఆయకట్టుకు అందుబాటులో ఉన్న నీటి మేరకు మార్చి 31 వరకు ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించనున్నట్లు చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల నాయకులు, రైతులు సహకరించాలని ఆమె కోరారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్ భారీగా వర్షాలు పడి రిజర్వాయర్లు నిండినప్పటికీ రబీ పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. తెలుగు గంగా, కెసి కాలువల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీ సిస్టం సరిగా లేకపోవడం వల్లే మీరు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు.
ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ వర్షకాలంలో మంచి వర్షపాతం నమోదవడంతో రబీ కాలానికి నీరు అందుబాటులో ఉండటం రైతుల్లో ఆనందం కలిగించిందని, అందుకుగాను చివరి ఆయకట్టు వరకు నీటివిడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రస్తుతం 16 టీఎంసీలు నీరు అందుబాటులో ఉన్నాయని, అదనంగా 5 టీఎంసీలు విడుదల చేసే అవకాశం లభిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందించవచ్చని తెలిపారు.

శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ సిద్ధాపురం చెరువు ద్వారా 23 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం కేవలం 10 వేల ఎకరాలకే నీరు చేరుతున్నదని, మిగిలిన 13 వేల ఎకరాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత మాట్లాడుతూ ఎస్సార్బీసీ వల్ల పాణ్యం మండలం, కొండజూటూరు గ్రామాల్లో పంటలు మునిగిన రైతులను ఆదుకోవడం కోసం 88 లక్షల ప్రతిపాదనలు ప్రభుత్వం పంపించామని, అలాగే తోగరచేడు గ్రామ రైతు నష్టపరిహారం కోసం 84 లక్షల ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో తుఫాను కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, అందువల్ల ఏప్రిల్ 15 వరకు సాగునీరు ఇవ్వాలని ఆమె కోరారు. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ కేసీ కాలువ క్రింద ఉన్న రైతులకు నీరు ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు.
Arattai