NANDYAL Dec 09: సింగిల్ డెస్క్ ద్వారా అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపే పరిష్కరించి, నూతన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, ఎల్‌డిఎమ్ రవీంద్ర కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను అవసరమైన అన్ని పత్రాలు అర్జీదారుల నుంచే తెప్పించుకొని, తిరిగి పంపకుండా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ఆర్. కృష్ణాపురంలోని హస్తకళల స్టోన్ మర్చెంట్లను మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కోసం 4 కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని, వాటికి తగిన స్థలాలను గుర్తించి సంబంధిత యాజమాన్యాలతో చర్చించి, వివరాలను ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్‌లో అప్లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు.

PMEGP కింద కేటాయించిన 137 లక్ష్యాల్లో కేవలం 59 మాత్రమే పూర్తి అయినందున, మిగిలిన వాటిని ప్రాధాన్యంతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా అర్హులైన వారికి బ్యాంకులు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని బ్యాంకర్లను కోరారు. గత త్రైమాసికంలో మొత్తం 1,025 పరిశ్రమల దరఖాస్తులు అందగా, వాటిలో 973 దరఖాస్తులకు అనుమతులు మంజూరు అయ్యాయని, ఇంకా 52 దరఖాస్తులు వివిధ శాఖల్లో పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీలు తదితర శాఖలు గడువులోపే అనుమతి ప్రక్రియ పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి కింద పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ చార్జీ సబ్సిడీ, సేల్స్ ట్యాక్స్ రాయితీలు వంటి పథకాల ద్వారా జిల్లాలో 9 యూనిట్లకు రూ. 35.41 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలను కమిటీ ఆమోదించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో నిర్ణీత లక్ష్యాలను అధిగమించి జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, యువతి–యువకుల నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
Arattai