ALLAGADDA Dec 16:- ప్రజా ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆళ్లగడ్డ పట్టణంలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో ఆరు కోట్ల రూపాయలతో అధునాతన వైద్య పరికరాలతో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీమతి భూమా అఖిలప్రియతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 6 కోట్ల రూపాయలతో అధునాతన వైద్య పరికరాలతో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని… రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించారు. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా సుమారు 11 స్పెషలైజేషన్లకు సంబంధించిన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

గతంలో కూడా ఈ ఆసుపత్రిలో నెలకు సుమారు 80 నుంచి 100 వరకు ప్రసవాలు జరిగేవని, ముఖ్యంగా సాధారణ కాన్పులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), 19 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీలు), 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 ఏరియా ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయని తెలిపారు. ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ కెపాసిటీ పెంపు అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Arattai