సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఉత్తమ గురువుకు సత్కారం…
సమాజానికి దిశా నిర్దేశం చేసేది గురువులే…..
విద్యావ్యవస్థలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను గౌరవించడం సమాజానికి స్ఫూర్తినిచ్చే అంశమని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి అన్నారు. గురువారం నంద్యాలలోని నంది రైతు సమాఖ్య కార్యాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానసభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న బలపనూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్లభాషోపాధ్యాయులు అవ్వారి శేషఫణిని సాహితీ స్రవంతి అధ్యక్ష కార్యదర్శులు యం.శ్రీనివాసమూర్తి, డా.నీలం వెంకటేశ్వర్లు శాలువా,సన్మానపత్రంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నేటి సమాజానికి శేషఫణి వంటి ఉత్తమ ఉపాధ్యాయుల సేవలు ఎంతో అవసరముందన్నారు. ముఖ్యఅతిథి, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త కాదరబాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ తన వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న శేషఫణి విజ్ఞానదీప్తిగా నిలిచారన్నారు.

విశిష్ట అతిథి, మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్ధుతున్న ఉత్తమ సమాజ నిర్మాణశక్తి శేషఫణి అని కొనియాడారు. మహానంది మండల విద్యాధికారి రామసుబ్బయ్య మాట్లాడుతు మహానంది మండలంలో గాజులపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి వీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నంద్యాల ఎన్ జీ ఓ అధ్యక్షులు వుశ్శేన్ రెడ్డి మాట్లాడుతూ అటు విద్యాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి, సాహిత్యాభివృద్ధిలోను శేషఫణి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
నంది రైతు సమాఖ్య కార్యదర్శి కృష్ణారెడ్డి, వివిధ స్వచ్ఛంద, సాహితీ సంస్థల ప్రతినిధులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డా.కిశోర్ కుమార్ , గోపాల్ , మణిశేఖర్ రెడ్డి , లలితా సరస్వతి, రామచంద్రమూర్తి తదితరులు అవార్డ్ గ్రహీత అవ్వారి శేషఫణి సేవలను గుర్తించి,గౌరవించటం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ” సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడు” అనే అంశంపై కవులు నరేంద్ర, మాబుబాష,నీలకంఠమాచారి,కొప్పుల ప్రసాద్ ,రఫీలు వినిపించిన కవితలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు రమేష్ బాబు, శివరామిరెడ్డి, సాహితీ మిత్రులు పాల్గొన్నారు.
Arattai