NANDYAL JAN 07:- జిల్లాలో జాతీయ రహదారులపై జరుగుతున్న రహదారి ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. పోలీసు అధికారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో వెంటనే స్పీడ్ బ్రేకర్లు, రహదారి సూచిక బోర్డులు, స్పీడ్ గన్స్, పవర్ఫుల్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (జనవరి 1 నుండి 31 వరకు)లో భాగంగా జిల్లా రహదారి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆర్ & బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, ఏఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, డీటీసీ శివారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌హెచ్-40, 44, 340సి, 167కే రహదారులపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా పోలీసు శాఖ గుర్తించిన యాక్సిడెంట్ జోన్లలో తక్షణ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-40లోని సోమయాజులపల్లె, ఆళ్లగడ్డ, చాబోలు జంక్షన్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ సరైన సర్వీస్ రోడ్లు, స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలన్నారు.

లాగే తమ్మరాజుపల్లె ప్రాంతం ప్రమాదాల కేంద్రంగా మారినందున అక్కడ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్‌హెచ్-340సి మండ్లెం నుంచి ఆత్మకూరు వరకు రహదారి నిర్మాణం పూర్తైనప్పటికీ, అండర్‌పాసులు, సర్వీస్ రోడ్లు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గోడౌన్లకు వెళ్లేందుకు ఎక్కువ దూరం తిరగాల్సి వస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు.
రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్లకు ఏర్పాటు చేసిన ఎస్ఓఎస్ బాక్సులు అత్యవసర సమయాల్లో టోల్ ప్లాజా ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం అందించడంలో కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్‌హెచ్-40లో తగిన విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వెంటనే రహదారి లైటింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఎన్‌హెచ్-44లో సర్వీస్ రోడ్లు, విద్యుత్ సరఫరా, పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు. రానున్న మహాశివరాత్రి పర్వదినం దృష్ట్యా శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డు మిర్రర్లు, స్పీడ్ బంప్స్ ఏర్పాటు చేసి భద్రతను మరింత పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యార్థి బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆయా బస్సుల్లో కేవలం విద్యార్థులే ప్రయాణించే విధంగా పర్యవేక్షణ పెంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గత గణాంకాలను ప్రస్తావిస్తూ, 2024 సంవత్సరంలో 542 ప్రమాదాలు జరిగి 271 మంది మృతి చెందగా, 2025 సంవత్సరంలో 567 ప్రమాదాలు జరిగి 296 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2026లో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కఠిన చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, ఎన్‌హెచ్-40లో చీకటి కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, తక్షణమే విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని సూచించారు. అలాగే ఎన్‌హెచ్-340సి వద్ద డ్రమ్స్ ఏర్పాటు వల్ల ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, అక్కడ ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిద్దలూరు, ప్యాపిలి ఘాట్ రోడ్డు మార్గంలో కూడా ప్రమాద నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే మార్గాల్లో స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఎన్‌హెచ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Arattai