AMARAVATHI April 17:- విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఈనెల 18, 19 తేదీల్లో రెండు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ హజ్ ప్రయాణికులు మక్కా యాత్రకు బయలుదేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి హజ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకరోజు ముందుగానే విజయవాడకు చేరుకునే యాత్రికులందరికీ పురుషులు, మహిళలకు వేరువేరుగా వసతి ఏర్పాట్లు, భోజన సౌకర్యం తదితర ఏర్పాట్లను మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో హజ్ కమిటీ పూర్తి చేసింది.

శుక్రవారం విమానాశ్రయం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన విడిది ఏర్పాట్లను న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా, సీఈఓ గౌస్ పీర్ లు హజ్ యాత్రికులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన వసతులు, ఇతర మౌళిక సదుపాయాల గురించి మంత్రి ఫరూక్ కు వివరించారు.ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఏపీ నుంచి ప్రస్తుత ఏడాది 2000 మంది యాత్రికులు హజ్ కు బయలుదేరుతున్నారని పేర్కొన్నారు. గన్నవరం నుంచి ఈనెల 18వ తేదీన మొదటి దశలో 156 మంది, 19వ తేదీన రెండవ దశలో 177 మంది హజ్ కు బయలుదేరుతున్నారని తెలిపారు.

మిగిలినవారు హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల నుంచి హజ్ కు బయలుదేరుతారని అన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ కి వెళ్లి వచ్చే వారందరికీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం నుంచి బయలుదేరుతున్న వారందరికీ పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి, భోజన సౌకర్యం, పురుషులు, మహిళలకు వేరువేరుగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో హజ్ కమిటీ యాత్రికులందరికీ అన్ని ఏర్పాట్లును పూర్తి చేయడం జరిగిందని మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఇక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రార్థనాలయంలో జుమ్మా నమాజులో మంత్రి పాల్గొని ఆ తరువాత యాత్రికులతో కలిసి భోంచేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Arattai