NANDI NEWS April 17:- జనగణన-2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు (Self Enumeration) విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ముందుగా పోర్టల్‌లో నమోదు చేసుకుని, మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్యా స్థాయి, ఉపాధి వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు.

ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నమోదు పూర్తిచేసే ముందు “Preview” ఆప్షన్ ద్వారా వివరాలను పరిశీలించి, అనంతరం “Final Submit” చేయాలని తెలిపారు. నమోదు పూర్తైన వెంటనే 11 అంకెల ప్రత్యేక SE ID ఉత్పత్తి అవుతుందని, భవిష్యత్తు అవసరాల కోసం దానిని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా నమోదు చేయలేని వారికి ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు.జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Arattai