AMARAVATHI Apri17:- స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే… కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఈ ఏడాది మార్చి 31 వరకు రూపొందించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకులను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు జిల్లాలు స్వచ్ఛాంధ్రలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా… శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇందులో విశాఖ జిల్లాకు 92 శాతం, విజయనగరం, గుంటూరు జిల్లాలకు 85 శాతం మార్కులు వచ్చాయి. అట్టడుగున ఉన్న ఏఎస్ఆర్ జిల్లాకు కేవలం 53 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. డోర్ టు డోర్ కలెక్షన్, తడి చెత్త-పొడి చెత్త వేరు చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఓడీఎఫ్ ప్లస్ మోడల్ వంటివి ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నట్టు చెప్పారు.. అయితే ఇకపై జిల్లాలకు స్వచ్ఛాంధ్ర ర్యాంకులు థర్డ్ పార్టీ ఇచ్చేలా చూడాలని సీఎం సూచించారు.

జూన్ కల్లా 100 శాతం చెత్త క్లియర్
మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నిర్ణీత పరిధిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేలా చూడాలన్నారు. గతంలో వ్యర్ధాలతో నిండిపోయిన డంపింగ్ యార్డుల్లో… ప్రస్తుతం చెత్త క్లియర్ చేయడంతో పాటు ఆయా స్థలాలను పచ్చదనంతో నింపేలా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణానికి సమీపంలో ఉన్న డంపింగ్ కేంద్రాలను ముందుగా పార్కులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. 2024 జూన్ నుంచి నేటి వరకు పట్టణాల్లో 153 లక్షల టన్నుల చెత్తకు గాను, 114 లక్షల టన్నుల చెత్త తొలగించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ జూన్ కల్లా 100 శాతం క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో పేరుకు పోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలిగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్త ప్రాసెసింగ్ కూడా 100 శాతం జరగాలన్నారు. కంపోస్ట్ మార్కెటింగ్ చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. మ్యాజిక్ డ్రెయిన్లకు అనుసంధానంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ తీసుకురావడం ద్వారా మురుగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహద పడుతుందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, నెట్ జీరో, గ్రీనరీ పెంపు, క్లీన్-హైజీన్ కిచెన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. గాలి నాణ్యత పర్యవేక్షణకు ప్రస్తుతమున్న 83 ప్రాంతాలతో పాటు, అదనంగా 53 మాన్యువల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
డిసెంబర్ కల్లా గోబర్ ధన్ ప్లాంట్లు సిద్ధం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు, ఈ వేస్ట్ కలెక్షన్‌కు సంబంధించి అమలు చేస్తున్న విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నామని, గోబర్ ధన్ యూనిట్లు, గ్రీన్ షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నామని అధికారులు తెలిపారు. మురుగు నీటి నిర్వహణలో కూడా సమూల మార్పులు తెస్తున్నామని… గ్రే వాటర్, బ్లాక్ వాటర్ నిర్వహణకు భారీ ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించారు. పొడి చెత్తను సేకరించే గ్రీన్ షాపులకు స్వచ్ఛ రథం ఏజెన్సీ నుంచి, పంచాయతీ నుంచి సాయం అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ కల్లా గోబర్ ధన్ ప్లాంట్లు సిద్ధం అవుతాయని వెల్లడించారు. అలాగే ‘స్వచ్ఛ పథం’ పేరుతో గ్రామీణ రోడ్ల శుభ్రత కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు
10 జిల్లాల్లో 590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పట్టణాల్లో 2024-2026 మధ్య గ్రీన్ స్పేస్ పార్కులు 57 అభివృద్ధి చేసినట్టు వివరించారు. మరో 284 గ్రీన్ స్పేస్ పార్కులు, 100 స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అధికారులు తెలపగా, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు సోక్ పిట్స్, కిచెన్ గార్డెన్స్, మ్యాజిక్ డ్రెయిన్స్ వంటి విధానాలు అవలంభిస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా… 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, 1 లక్ష సోక్ పిట్స్, 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కి.మీ. మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా నిలపాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను… 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీక్షలో మంత్రి నారాయణ, పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఎంఏయూడీ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాక డైరెక్టర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Arattai