AMARAVATHI Jan30 :- కారుణ్య నియామకాలతో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి జరిగిన వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సచివాలయంలోని మంత్రి గొట్టిపాటి రవి కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 27 మంది లబ్దిదారులు మంత్రి గొట్టిపాటి, సీఎస్ విజయానంద్ చేతుల మీదుగా శుక్రవారం నాడు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విద్యుత్ శాఖలో సుమారు 500 మందికి పైగా అర్హులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యతో పాటు అన్ని అర్హతలున్న వారికి కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కూటమి ఏర్పడిన తరువాత చేపట్టిన కారుణ్య నియామకాల్లో విద్యార్హతలను బట్టి జూనియర్ ఇంజనీర్ పోస్టులను కూడా భర్తీ చేసి వారి సేవలను వినియోగించుకుంటున్నామన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఏజ్ రిలాక్షేషన్ విషయంలోనూ సానుకూలంగా స్పందించి కారుణ్య నియామకాలకు పచ్చజెండా ఊపారని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. తద్వారా బాధిత కుటుంబాలకు చెందిన ఓవర్ ఏజ్, అండర్ ఏజ్ వారికి ప్రత్యేక అనుమతులతో ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కారుణ్య నియామకాలు చేపడుతుందని చెప్పారు.

దీనితో బాధితుల కుటుంబాలకు త్వరితగతిన ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత విద్యుత్ శాఖ ఇన్ సర్వీస్ ఉద్యోగులతో పాటు, కొత్తగా విధుల్లో చేరిన వారికి అవసరమైన శిక్షణను విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులందరూ విధుల్లో రెట్టింపు ఉత్సాహంగా పని చేసి విద్యుత్ సంస్థలకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి సూచించారు.

విద్యుత్ ఉద్యోగుల భద్రత, యోగక్షేమాలను ప్రభుత్వం చూసుకుంటుందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. విధి నిర్వహణ సమయంలో ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికతకు అనుగుణంగా స్కిల్స్ ను పెంచుకుంటూ ఉంటే పదోన్నతులు త్వరగా వస్తాయని సీఎస్ స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ఉద్యోగుల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమం ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డితో పాటు జెన్కో డైరెక్టర్లు, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Arattai