NANDYAL April 27 :- నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఐఓసిఎల్ (IOCL), బిపిసిఎల్ (BPCL), హెచ్‌పిసిఎల్ (HPCL) వంటి పలు పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సరఫరా సజావుగా కొనసాగుతున్నందున, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో మొత్తం 223 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా, వాటిలో 33 రిలయన్స్, 2 జియో బంకులు ఉండగా, మిగిలినవి ఐఓసిఎల్ (IOCL), బిపిసిఎల్ (BPCL), హెచ్‌పిసిఎల్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. అన్ని బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ధృవీకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయంలో తాత్కాలికంగా డీజిల్ నిల్వలు తగ్గిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులతో సమన్వయం చేసి, సాయంత్రం 5 గంటల కల్లా అన్ని బంకుల్లో సరఫరా సాధారణ స్థితికి తీసుకువస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురికాకుండా, సాధారణ అవసరాలకు సరిపడా మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాన్లలో లేదా డ్రమ్‌లలో అధిక మొత్తంలో ఇంధనాన్ని నిల్వ చేయవద్దని సూచించారు. ఇంధనాన్ని కాన్లలో సరఫరా చేయడంపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసం హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ కావాలంటే సంబంధిత వ్యవసాయ అధికారి మరియు తహసీల్దార్ ధృవీకరించిన కూపన్ తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రధాన ఆయిల్ కంపెనీల పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి బంక్ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. పెట్రోల్, డీజిల్‌ను లూజ్‌గా (క్యాన్లు, బాటిళ్లలో) విక్రయించడం పూర్తిగా నిషేధించామని, కేవలం అధికారుల ధృవీకరణ ఉన్న కూపన్‌తోనే రైతులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నందున ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేయకుండా సహకరించాలని ఎస్పీ సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు సహకరించి పరిస్థితిని సాధారణంగా కొనసాగించేందుకు సహాయం చేయాలని అధికారులు కోరారు.
Arattai