NANDYAL May19 :- నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చిన్న మజర గ్రామం రామసముద్రం. చిన్న గ్రామమే అయినప్పటికీ వ్యవసాయ ఆధారిత జీవన విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ పరిసరాల్లో ప్రధానంగా మినుములు, మొక్కజొన్న, కంది, పెసలు వంటి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. వ్యవసాయమే గ్రామ ప్రజల జీవనాధారం. అలాంటి గ్రామానికి ఊపిరిలా నిలిచింది “రామసముద్రం కుంట”. దాదాపు 12.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట గ్రామానికి ప్రధాన జలవనరుగా ఎన్నో ఏళ్లుగా రైతాంగాన్ని ఆదుకుంటోంది. గ్రామంలోని బావులు, బోర్లు ఈ కుంట నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. కుంటలో నీరు సమృద్ధిగా ఉంటే భూగర్భ జలమట్టాలు పెరిగి బావుల్లో, బోర్లలో నీరు నిలకడగా ఉండేది. దీంతో రైతులు పంటలు సాగు చేసి కుటుంబాలను పోషించుకునేవారు.

అయితే గత కొంతకాలంగా కుంటలో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. కుంటకు ప్రత్యేకంగా కాలువలు లేకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో పడే వర్షపు నీరే ప్రధాన ఆధారం. కానీ పూడిక కారణంగా వర్షపు నీరు నిలవకపోవడంతో కుంట త్వరగా ఎండిపోతుండేది. ఫలితంగా గ్రామంలోని బావులు, బోర్లలో నీటి మట్టం పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ కుంట కింద సుమారు 200 నుండి 250 ఎకరాల వరకు వ్యవసాయ భూములు సాగులో ఉన్నాయి. కాలువల సౌకర్యం లేకపోయినా రైతులు మోటార్ల ద్వారా కుంట నీటిని, బావులు మరియు బోర్ల నీటిని ఉపయోగించి సాగు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని దాదాపు 150 కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ నీటి వనరుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన గ్రామస్థులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని పరిశీలించిన అధికారులు గ్రామ ప్రజలతో సమావేశమై శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.3.30 లక్షల వ్యయంతో రామసముద్రం కుంటలో పూడికతీత పనులకు ఆమోదం తెలుపుతూ వెంటనే పనులు ప్రారంభించారు.
ఈ వారం నుంచే కుంటలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ 140 నుండి 150 మంది వరకు గ్రామీణ శ్రామికులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు గ్రామీణులకు ఉపాధి లభిస్తుండగా, మరోవైపు గ్రామానికి జీవనాడిగా ఉన్న కుంట పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కేవలం నీటి వనరులు మాత్రమే కావు… అవి రైతుల జీవనాధారం. రామసముద్రం కుంట పూడికతీత ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు మళ్లీ నీటి భద్రత కలుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు అవసరమైన శాశ్వత ఆస్తులు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు, అధికారులు కలిసి పనిచేస్తే గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది” అని తెలిపారు. పూడికతీత పనులు పూర్తయితే మళ్లీ కుంట పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకుని బావులు, బోర్లలో నీరు పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “మళ్లీ పాత రోజుల్లా మా పొలాలు పచ్చగా మారతాయి” అంటూ గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన ఈ మార్పు… ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలైతే గ్రామీణ జీవన విధానంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలవో చూపిస్తున్న విజయగాథగా నిలుస్తోంది.
Arattai