NANDYAL May19 :- నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో యువతలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం పెంపొందించే ఉద్దేశ్యంతో నిర్వహించడ మైనది .
ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత మాదక ద్రవ్యాల మాయాజాలానికి లోనవుతూ తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అలవాటు ప్రారంభంలో సరదాగా కనిపించినప్పటికీ, తర్వాత అది వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితి, కుటుంబ జీవితం మరియు సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. యువత తమ లక్ష్యాలను గుర్తించి కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.అలాగే విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు.

సోషల్ మీడియా మరియు చెడు స్నేహాల ప్రభావానికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నేరాల సంఖ్య పెరగడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం మరియు సమాజంలో అస్థిరత ఏర్పడుతుందని వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక నష్టాలపై వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, కుటుంబ సభ్యులు మరియు సమాజంలో కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగ కల్పనాధికారి సోమశివారెడ్డి మాట్లాడుతూ యువత తమ శక్తి సామర్థ్యాలను సరైన దిశలో వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, కష్టపడి పనిచేసే వారికే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి పథకాలను వినియోగించుకొని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించి సమాజంలో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Arattai