NANDYAL June08:- నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శారడా విద్యానికేతన్ పాఠశాలలో 2005 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఉత్సాహభరితంగా, ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది. 30 మంది కి పైగా పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొని తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల వ్యవస్థాపకులు కీ.శే. పాండురంగారావు చిత్రపటానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. విద్యారంగంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.తమ జీవిత వికాసానికి బాటలు వేసిన గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, శోభన్ కుమార్, శ్రీనివాస్, చంద్రశేఖర శర్మ, సాంబశివారెడ్డి, శంకర్, రవికుమార్, జనార్దన్ రెడ్డి, సుబ్బయ్య, శ్రీమతి నాగమణి తదితరులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, పాఠశాలలో పొందిన విద్య, విలువలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే తమ జీవిత విజయాలకు పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం సహ విద్యార్థులు, గురువులతో ఒకే వేదికపై కలుసుకోవడం మరపురాని అనుభూతిని కలిగించిందని తెలిపారు.ఉపాధ్యాయులు మాట్లాడుతూ, తమ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి సమాజంలో మంచి గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురు-శిష్య బంధం కాలగమనంలోనూ చెదరని అనుబంధమని, ఇలాంటి కలయికలు ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.ఆప్యాయ పలకరింపులు, జ్ఞాపకాల పంచిక, ఆనందోత్సాహాల నడుమ సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.
Arattai