NANDYAL July02:- విబిజీ రాంజీ ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.గురువారం పాణ్యం మండలంలోని మార్కెట్ యార్డు నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎమ్మెల్యే గౌరు చరిత లు విబిజి రామ్ జి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ….పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విబిజి రాంజీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు ఉపాధి కలుగుతోందన్నారు.నంద్యాల జిల్లాలో ఎండనకా వాననకా కష్టపడి పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు వేయడం వాగులను క్లియర్ చేయడం చెక్ డ్యామ్‌లలో భూగర్భ జలాలు పెంచడం లాంటి ఎన్నో మంచి పనులు చేయడం వల్ల నంద్యాల జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

చెక్ డ్యాముల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. విబిజి రాంజీ ద్వారా100 రోజుల నుంచి ప్రస్తుతం 125 రోజుల పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించడం జరుగుతుందన్నారు. వేతనాలు సమయానికి వచ్చేటట్లుగా వి బి జి రామ్ జి చట్టం వర్తిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎలాంటి పనులు కావాలో ప్రజలు గ్రామసభల ద్వారా అడిగినట్లయితే గ్రామ సభ తీర్మానం చేసి ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత జిల్లా కలెక్టర్ మరియు డ్వామా పిడి, ఎంపీడీవో ఈ ముగ్గురి పర్యవేక్షణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పేదలకు పనులు కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ పథకం ద్వారా గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ గా మొదట రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే రైతుల అభ్యర్థనల మేరకు పొలాల్లో రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని మన జిల్లాను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ….గతంలో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం విబిజి రాంజీ గా మార్చి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా చేపడుతున్న పనులు నంద్యాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు.

గ్రామాల అభివృద్ధికి సంబంధించి గ్రామ సభలో మీరు ఏ పని కావాలో కోరినట్లయితే అది మండల పరిషత్ కు వెళుతుంది వారు 14 రోజులలో ఆమోదించిన తర్వాత ఆ పని మనం చేసుకోవచ్చన్నారు.
కొత్త పనులు కావాలంటే మండల పరిషత్ జిల్లా పరిషత్ ద్వారా ఆమోదింప చేసుకోవచ్చన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ నిర్దేశించిన కొలతల ప్రకారం ఇకనుంచి వేతన దారునికి 312 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్ ఆవరణంలో మొక్కలు నాటారు. జిల్లాలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి రఘురాం, డ్వామా పిడి సూర్యనారాయణ, వి బి జి రాంజీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Arattai