NANDYAL July18:- జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం బేతంచర్ల మండలంలోని కొలుములపల్లి గ్రామంలో ఉన్న పలు పరిశ్రమలను కలెక్టర్ సందర్శించి, అక్కడి ఉత్పత్తి విధానాలను పరిశీలించారు.

ముందుగా ప్రెసీఫాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (PreciFast Private Limited) పరిశ్రమను సందర్శించి.. అక్కడ నట్లు, బోల్టుల తయారీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ముడి పదార్థాల వినియోగం, యంత్రాల పనితీరు, నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలపై పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూ, ఉత్పత్తుల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించారు.

అనంతరం హేమా హెర్బల్ ప్రొడక్ట్స్ (Hema Herbal Products) పరిశ్రమను కలెక్టర్ సందర్శించారు. కలబంద (అలోవెరా) ముక్కలను ఉపయోగించి షాంపూలు, సబ్బులు తదితర హెర్బల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది ఉత్పత్తి తయారీ వరకు అనుసరిస్తున్న ప్రక్రియ, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పరిశ్రమల యాజమాన్యంతో కలెక్టర్ ముఖాముఖిగా సమావేశమై, వారి సమస్యలు, అవసరాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పరిశ్రమల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో పరిశ్రమలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో మంచి గుర్తింపు పొందాలని పరిశ్రమల యాజమాన్యానికి సూచించారు. డోన్ ఆర్డీఓ నరసింహులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, బేతంచర్ల తహసీల్దార్ నాగమణి, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు తదితరులు కలెక్టర్ వెంట వున్నారు.
Arattai