2టన్నుల రీసైక్లింగ్ వ్యర్థాలు సేకరించిన స్కౌట్ విద్యార్థులు
NANDYAL Aug01 :- ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, గోస్పాడులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఐటీసీ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఇంటర్-స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్లో పాఠశాల స్కౌట్స్ విద్యార్థులు చురుకుగా పాల్గొని సుమారు రెండు టన్నుల పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి రీసైక్లింగ్ కోసం ఐటీసీ ప్రతినిధులకు అందజేశారు.

పాఠశాల ప్రిన్సిపాల్ ఖాజా హుసేన్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రెండు టన్నుల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించడం అభినందనీయమన్నారు. స్కౌట్ మాస్టర్ డా. నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వ్యర్థాలను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు సహజ వనరులను సంరక్షించవచ్చన్నారు.

గైడ్ కెప్టెన్ సుజాత మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన వ్యర్థాల సేకరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులను అభినందించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai