బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
NANDYAL Aug 05:- పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపు, డ్రాపౌట్ల నివారణతో పాటు లీప్ (LEAP) యాప్లో సమాచారాన్ని సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం మండలం బలపనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల నిర్వహణ, లీప్ యాప్లో నమోదవుతున్న వివరాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి పాఠశాల కేటాయించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల లీప్ యాప్లో నమోదయ్యే సమాచారం ఖచ్చితంగా, సకాలంలో ఉండేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులందరి వివరాలను లీప్ యాప్లో పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు యాప్ వినియోగంపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపౌట్ల పూర్తిస్థాయి నివారణ, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లల గుర్తింపు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగుదలపై మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణం కల్పించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు, వంటశాల నిర్వహణను తనిఖీ చేసి విద్యార్థులకు పోషకాహారం నాణ్యంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విద్యా ప్రమాణాలను ప్రతి పాఠశాల తప్పనిసరిగా సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కేపీఐల అమలులో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Arattai