జంధ్యాల రచనలపై ఆకట్టుకున్న ఉపన్యాసం…
NANDYAL Aug 05:- కరుణశ్రీగా ప్రసిద్ధిచెందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలపై ఉపన్యాస కార్యక్రమం గురువారం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో గల “నల్లమలై పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి నల్లమలై పాఠశాల కరస్పాండెంట్ రమణ గారు అధ్యక్షత వహించారు.

సరస కవి డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొని, కరుణశ్రీ కవిత్వ ప్రత్యేకతలను వివరించారు. కరుణశ్రీ కవిత్వం ప్రత్యేక శైలిని కలిగి, తెలుగు నుడికారంతో వినసొంపుగా, ఆలోచనాత్మకంగా ఉండి పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందని అన్నారు. కరుణ రసాత్మకంగా కావ్యాలు రాయడంలో ఆయన సిద్ధహస్తులని కొనియాడారు. కరుణ శ్రీ రచించిన పుష్పవిలాపం పద్యాలను మధురంగా ఆలపించి విద్యార్థులకు తెలుగు సాహితీ వైభవాన్ని తెలియజేశారు.కరుణశ్రీ రాసిన ఉదయశ్రీ, కరుణశ్రీ , *విజయశ్రీ , వంటి గ్రంథాలు తెలుగు సాహిత్య లోకంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయని తెలిపారు.

కరుణశ్రీ కవిత్వం సంప్రదాయ, ఆధునిక, ఆధ్యాత్మిక అంశాలతో కలిసి ఉంటుందని, కరుణశ్రీ లాంటి మహోన్నత కవి మనకు లభించడం ఆంధ్రుల అదృష్టమని అన్నారు. దుఃఖానికి కారణాలు, వాటి పరిష్కార మార్గాలకు కరుణశ్రీ కవిత్వం చిరునామాగా నిలుస్తుందని, ఆయన మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజంలో శాంతికి, నైతిక విలువల అభివృద్ధికి తన కవిత్వాన్ని వినియోగించారని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బి.వి.ఎస్. ప్రసాద్, టీచర్ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సాహితీ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు
Arattai