పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Sep13:- పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా జిల్లాలో 3,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనం సమీపంలో ఉన్న రెవెన్యూ క్లినిక్ వద్ద ప్రజలకు జిల్లా కలెక్టర్ స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP), రసాయన రంగులతో తయారు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమై పర్యావరణానికి హాని కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించి మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా నీటి వనరులను వినియోగించాల్సిన అవసరం లేకుండా, ఇంటివద్దే ఒక పూలకుండీలో నిమజ్జనం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జనం పూర్తయిన అనంతరం అదే కుండీలో ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె కోరారు.

గణేష్ మండపాల నిర్వాహకులు భద్రతా నిబంధనలు పాటించాలి
జిల్లాలో గణేష్ మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీలు జారీ చేసే సూచనలు, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ లైన్ల విషయంలో ప్రత్యేక అప్రమత్తత వహించాలని, విద్యుత్ తీగలను కర్రలతో నెట్టడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ
కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న చర్యలకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంటివద్దే మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, మెంబర్ సెక్రటరీల సూచనలు, ఆదేశాల మేరకు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు
Arattai