నంద్యాల – శారదా విద్యాపీఠంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
NANDYAL Sep15 :- నంద్యాల పట్టణానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అవ్వారి శేషఫణి, పి. వెంకటసుబ్బయ్యలను ఫరూక్ నగర్ లోని శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా సత్కరించారు.
2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వీరు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ తరపున ఫిన్లాండ్ దేశానికి వెళ్లి అక్కడి విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చారు. ఈ సందర్భంగా శారదా విద్యాపీఠం కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఉదయ్ శంకర్, ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణయ్య, కార్యదర్శి చెన్నకేశవులు, శ్రీమతి విజయశ్రీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
ఈ సందర్భంగా డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ నంద్యాల నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై ఫిన్లాండ్ వెళ్లి రావడం గర్వకారణమని, వారి అనుభవం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీరు యువ ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ ఫిన్లాండ్ లో పిల్లలపై ఒత్తిడి లేని విద్య, పరీక్షల భయం లేని బోధన, ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ, ఆచరణాత్మక విద్యకు పెద్దపీట వేయడం తమను ఆకట్టుకున్నాయని, అక్కడ నేర్చుకున్న అంశాలను రాష్ట్ర విద్యా విధానంలో అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాపీఠం ప్రతినిధులు శివ నాగిరెడ్డి, మల్లికార్జున వీరప్ప, నాగేశ్వరరావు, నాగరాజు , నీలకంఠమాచారి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai