NANDYAL Nov 27:- డిసెంబర్ 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటియం)ను నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించాలని ఆమె సూచించారు. గురువారం, కలెక్టర్ చాంబర్ నుంచి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో మెగా పిటియం ఏర్పాట్లపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ డిసెంబర్ 5వ తేదీ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొనసాగుతుందని… ఇందులో విద్యార్థుల అకడమిక్ ప్రదర్శన, చదువులో ఎలా ఉన్నారు, ఇతర కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు, అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడుతారన్నారు. సమావేశం అనంతరం హెచ్పిసి (Holistic Progress Card) ను విద్యార్థులకు అందజేస్తారని, తద్వారా పిల్లల స్థితిని తల్లిదండ్రులు స్పష్టంగా తెలుసుకునే అవకాశముంటుందని వివరించారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి తల్లిదండ్రులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు, పరీక్ష ఫలితాలు, దినచర్యా పురోగతి తదితర వివరాలను సమయానుకూలంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన లీప్ యాప్ (Learning Excellence in Andhra Pradesh) ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.
అలాగే, ఎఫ్.ఎల్.ఎన్. (Functional Literacy & Numeracy) పరిధిలో విద్యార్థులు చదువుతున్న తరగతికి తగ్గ పఠన–లేఖన నైపుణ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయంపై కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారని తెలిపారు.10వ తరగతి విద్యార్థుల సిలబస్ డిసెంబర్ 5 నాటికి పూర్తికాబోతోందని, అక్కడి నుంచి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారికి పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలలకు ప్రభుత్వం అందించిన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, లర్నింగ్ కిట్లు, అలాగే విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కూడా పిటియం సందర్భంగా తల్లిదండ్రులకు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమాన్ని సమీక్షించనున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో హాజరుకానున్నారని తెలిపారు. తల్లిదండ్రులు,ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ ఈ మెగా పిటియంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Arattai