NANDYAL Feb22 :- నంద్యాలలో శ్రీ కాటమరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షులు శ్రీ కేవీ కృష్ణయ్య, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెంపన మోహన్, కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ శ్రీ బీ. నాగన్న యాదవ్, నంద్యాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి.వి. సుబ్బయ్య, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ శ్రీ చిన్నపరెడ్డి, ప్రస్తుత రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ కేశవమూర్తి, కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర్లు, పింగళి సూరన కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసమూర్తి, చేతన సాహితీ పరిషత్ అధ్యక్షులు శ్రీ అన్నెం శ్రీనివాసరెడ్డి, ప్రముఖ భాషావేత్త కవి మాబు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు శ్రీ కె. నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కె.వి. కృష్ణయ్య గారు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచం పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ వంటి అంశాల ప్రాముఖ్యతను విశదీకరిస్తున్న తరుణంలో, భారతదేశంలోనే ప్రాచీన కాలంలో ఈ విలువలను ఆచరణలో పెట్టిన దూరదృష్టి కలిగిన రాజుగా కాటమరాజును ప్రస్తావించారు.
నేటి తరానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అత్యవసర ఆలోచనగా మారిందని, వందల ఏళ్ల క్రితమే కాటమరాజు వంటి మహనీయులు ప్రతిపాదించిన ప్రకృతి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, సమతుల్య జీవన విధానం వంటి భావనలు నేటికీ సమకాలీనంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, “ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి” అనే భారతీయ దార్శనిక భావాన్ని ఉటంకించారు. ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని దర్శించడం మన సంస్కృతిలోని మహత్తర విలువ అని, కాటమరాజు వంటి దైవస్వరూప రాజులు తమ కాలంలో ఆచరించి చూపిన ఆ ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.
పెద్ద ఎత్తున విద్యార్థులు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలు మరియు నంద్యాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయంతి వేడుకలకు విశేష వన్నె చేకూర్చారు.
చివరగా, కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ మోహన్ రావు గారు మాట్లాడుతూ, కాటమరాజు ఆలోచనలు మరియు భావజాలాన్ని ప్రస్తుత తరం ఆచరణలో పెట్టాలని ఆకాంక్షిస్తూ సభను ముగించారు.
Arattai